పార్టీ ఎంపీలపై మోదీ అసంతృప్తి
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు హాజరుకాని పార్టీ ఎంపీలపై ప్రధాని నరేంద్రమోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తరుచుగా తగినంతమంది బీజేపీ ఎంపీలు సభకు హాజరుకావడం లేదని, కోరం కూడా లేకపోతున్న కారణంగా సభా కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నాయని ఆయన వారిని మందలించారు. తాను ఎప్పుడంటే అప్పుడు ఇకపై ఫోన్‌లు చేస్తానని, ఎవరికైనా ఫోన్ చేయవచ్చని ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలని, ఆ మేరకు తనకు హామీ ఇవ్వాలని మోదీ వారిని అడిగారు.
మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. తాను ఎన్నో పనులు చేసుకుంటూ వస్తున్నాని, అలాంటప్పుడు కనీసం పార్లమెంటుకు హాజరై తమ వంతు పాత్ర పోషించడం ప్రతి ఎంపీ కనీస బాధ్యత అని వారికి సూచించినట్లు తెలుస్తోంది. సోమవారం కూడా పార్లమెంటు ఉభయ సభల్లో కోరం లేదని, దీని వల్ల సభ నడిపించే పరిస్థితి లేకుండా తయారైందని ప్రధాని మోదీకి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ చెప్పిన అనంతరం మోదీ ఎంపీల తీరుపై గుర్రుమన్నారంట. సభకు హాజరుకావాలని వేరే వారితో చెప్పించుకునే పరిస్థితి ఉండకూడదని, అది వారి వ్యక్తిగత బాధ్యత అని మోదీ గుర్తు చేశారంట.