ఆ పోకిరి పోలీస్ ఎవడు?
నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలో మునిగిపోయిన అమ్మాయిలు, మహిళలను అసభ్యకరంగా తాకుతూ పైశాచికానందం పొందిన పోకిరి పోలీస్ కోసం వేట మొదలైంది. అహ్మదాబాద్ నగరంలోని ప్రసిద్ధ కాకరియా చెరువు వద్ద ఏటా డిసెంబర్ చివరి వారంలో నిర్వహించే కాంకరియా కార్నివాల్ వేడుకల్లో బందోబస్తు కోసం వచ్చిన ఓ పోలీసు చేసిన నిర్వాకం తాలూకు వీడియో సోషల్ నెట్వర్క్లో హల్చల్ చేస్తోంది. కానిస్టేబుల్ ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగటంతో ఆ పోకిరీ పోలీస్ ఎవరో కనిపెట్టేందుకు ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
కార్నివాల్ లో బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తనకు ఎదురుగా వచ్చిన మహిళలనేకాక, పక్కనుంచే వెళ్లే అమ్మాయిలను అసభ్యకరంగా తాకాడు. ఈ తతంగమంతటినీ పోలీస్ వెనుక నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. వెనుక నుంచి చిత్రీకరించడంతో ఆ పోకిరి పోలీస్ ముఖం వీడియోలో రికార్డ్ కాలేదు. దీంతో డిసెంబర్ 31న కాకరియా ప్రాంతంలో బందోబస్తు డ్యూటీలో ఉన్న పోలీసులు అందరినీ పిలిపించి విచారిస్తామని, దోషిగా తేలినవారిని కఠినంగా శిక్షిస్తామని మణినగర్ ఇన్స్పెకర్ ఎన్ఎస్ దేశాయ్ తెలిపారు.