ఆదివాసీలు ఈ దేశ పౌరులేనా? | are tribals national citizens? | Sakshi
Sakshi News home page

ఆదివాసీలు ఈ దేశ పౌరులేనా?

Published Thu, Oct 30 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

ఆదివాసీలు ఈ దేశ పౌరులేనా?

ఆదివాసీలు ఈ దేశ పౌరులేనా?

ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టు తలపెట్టినా అక్కడి ఆదివాసీల అభిప్రాయాలను పరిగణనలోకి  తీసుకోవాలనే చట్టాలన్నా, రాజ్యాంగ సూత్రాలన్నా రాజ్యానికి లెక్కే లేదు. దళితుల లాగే సమాజం ఆదివాసీలను కూడా పౌరులుగా గుర్తించడం లేదు. ఒకవేళ మన సమాజానికి ఆదివాసుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వారి హక్కులను గౌరవించాలి, పరిరక్షించాలి. వారి సంస్కృతికి, వారి జీవన విధానానికి వారిని దూరం చేయకుండా, స్వేచ్ఛగా బతకనివ్వాలి. అంతే తప్ప అభివృద్ధి పేరుతో వారి జీవితాల్లో విధ్వంసం సృష్టించరాదు.
 
‘‘ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో చేర్చడం ద్వారా అట్టడుగు ప్రజల అభివృద్ధికి భరోసా లభించడం సంతోషమే. హక్కులను చట్టాలలో పొందు పర్చితే  సమస్య పరిష్కారం అవుతుందని మనం భావిస్తుంటాం. కానీ చట్టాలు మాత్రమే పరిష్కారం ఇవ్వలేవని గత అనుభవంలో తేలింది. సామాజిక, నైతిక మద్దతు లభించనిదే అవి అమలుకావు. అందుకే సమాజంలో వీటి పట్ల అంగీ కారం కుదరాలి. ఇది భారత దేశ ప్రత్యేకతగా చెప్పవచ్చు.’’ భారత రాజ్యాంగ రచనా కాలంలో బొంబాయిలోని సిద్ధార్థ కళాశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ఉపన్యాసంలోని మాటలివి. ఆరు దశాబ్దాలు పైబడినా  నాటి ఆయన అంచనాల్లో రవ్వంత మార్పు రాలేదు.

పైగా ప్రభుత్వాలు చేసిన చట్టాలు అమలుకు నోచుకోవడం గగనమే అవుతుంది. అలా అని అన్ని చట్టాలు అమలు కాకుండా ఉండవు. ధనిక, భూస్వామ్య వర్గాల, ఆధిపత్య కులాల, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం జారీ అయ్యే జీవోలు శర వేగంగా అమలవుతాయి. కానీ దళిత, ఆదివాసీ అభివృద్ధి, సంక్షేమం కోసం ఎప్పుడో అరకొరగా ఏవైనా  ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు వచ్చినా అవి ఎన్నడూ సరిగ్గా అమలు కావు. అందువల్లనే ఆదివాసీల అభివృద్ధి మాటలకే పరిమితమవుతోంది.

ఎవరికీ పట్టని వారు ఎవరంటే.....?

అలా సమాజానికి, పాలకులకు కూడా పట్టకుండా ఉండిపోయినవి ఆదివాసీల సమస్యలే. రాజ్యాంగాన్ని రచించే సమయంలో నాటి నేతలు ఆదివాసీల భవిష్యత్తుని, సమాజం నుంచి వారికి రాబోయే చేటుని గ్రహించి, శ్రద్ధగా ఎన్నో అంశాలను చర్చించారు. ఆదివాసీల రక్షణకు పలు చట్టాలను రాజ్యాంగంలో పొందుపర్చారు. రాజ్యాంగ సభ సమావేశాల చివరి రోజైన నవంబర్ 26, 1949న అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ‘‘ఆదివాసులకు ప్రత్యేక పాలనాధికారాలు, స్వయం పాలనా వ్యవస్థలు ఉంటాయి. వాళ్ల ఆర్థిక, సామాజిక పునాదులపై ఆధారపడి మాత్రమే వారి అభివృద్ధి సాగాలి. వాళ్ల ప్రాంతానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా, వాళ్ల ప్రత్యేక మండలుల అంగీకారం తప్పనిసరిగా ఉండాలి’’ అని తేల్చి చెప్పారు. సామాజిక నిపుణులు, కార్యకర్తలు నేటికీ అదే విషయాన్ని మాట్లాడాల్సి రావడం శోచనీయం. ఆదివా సుల సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై అధ్యయనం కోసం యూపీఏ-2 ప్రభుత్వం వర్జినయస్ కాకా నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. ఇటీవలే అది తన నివేదికను సమర్పించింది. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రణా ళికలను రచించే ముందు వాళ్ల ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవాలనేది కమిటీ సిఫారసులలో ప్రధానమైనది. నిజానికి ఆదివాసీ ప్రాంతాల్లో అమలు చేయ గలిగిన విధానం ఇతర ప్రాంతాల్లో అమలు చేయడానికి కూడా అనువుగా ఉం టుందని కమిటీ అభిప్రాయపడింది. అటవీ హక్కుల చట్టం-2006. షెడ్యూల్డ్ ప్రాంతాల పంచాయతీ విస్తరణ చట్టం, ఆదివాసీ సబ్ ప్లాన్‌లు ఆశించినంతగా అమలు జరగడంలేదని, ప్రభుత్వాలు వాటి అమలుకు శ్రద్ధ వహించాలని అది సిఫారసు చేసింది. విద్య, ఆరోగ్యం, బతుకుతెరువు లాంటి పలు ఇతర విష యాలపైన కూడా ఈ కమిటీ చాలా ప్రయోజనకరమైన సిఫారసులను చేసింది. ఇటువంటి కమిటీల నియామకం, అవి కొన్ని సిఫారసులతో నివేదికలు సమ ర్పించడం ప్రభుత్వాలకు కొత్తకాదు. భూరియా కమిషన్, ముంగేకర్ కమిషన్, ఇలా ఎన్నో వచ్చాయి, పోయాయి. కానీ ఆదివాసీల అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనన్న చందంగానే ఉంది.

పిట్టల్లా రాలే ‘విలువ’లేని బతుకులు

మొట్టమొదటగా ఆదివాసీల విద్య అనే అంశాన్నే తీసుకుందాం. ప్రభుత్వ లెక్క ల ప్రకారమే ఆదివాసీల బిడ్డల్లో 70 శాతం పదవ తరగతిలోపు బడి మానే స్తున్నారు. ఇక రెండో ముఖ్యమైన అంశం ప్రభుత్వ ఉద్యోగాలు. 2004 లెక్కల ప్రకారం ఏ గ్రేడ్ ఉద్యోగులలో 4.1 శాతం, బి గ్రేడ్‌లో 4.0 శాతం, సి గ్రేడ్‌లో 6.7 శాతం, డి గ్రేడ్‌లో 6.7 శాతం మాత్రమే ఆదివాసీలున్నారు. ఇక ఆదివాసుల అనారోగ్య సమస్యల పరిస్థితి చూస్తే సమాజమే సిగ్గుతో తలవంచుకునే విధంగా ఉంది. దేశవ్యాప్తంగా సగటున వెయ్యికి 18 మంది పిల్లలు మరణిస్తుంటే, ఆది వాసీలలో అది రెండింతలు ఎక్కువ, అంటే 36. ఇక పౌష్టికాహార లోపం గురించి మాట్లాడాల్సిన పనేలేదు. ఒకప్పడు గిరిజన ప్రాంతాల్లో పండ్లు, కూరగాయలు, సహజసిద్ధంగా లభించే వందలాది తృణధాన్యాలు వారికి అందుబాటులో ఉం డేవి. సాధారణ పౌరులకంటే వైవిధ్య భరితమైన ఈ ఆహారం వారిని బలిష్టంగా ఉంచేది. కానీ ఇప్పుడు ఆ అడవులూ లేవు, ఆ పంటలూ లేవు. పౌష్టికాహారం అంతకన్నా లేదు. కొట్టొచ్చినట్లు కనిపించే పౌష్టికాహార లోపం ఫలితంగా రోగనిరోధక శక్తి క్షీణించి సాధారణ జ్వరాలకు సైతం వందలాదిగా ఆదివాసీలు మృతి చెందడం సర్వసాధారణమైంది. ఆరోగ్యంతో ముడిపడి ఉన్న మరొక ప్రధాన సమస్య తాగునీరు. ప్రకృతిలో, నదీపరీవాహక ప్రాంతాల్లో సహజసిద్ధంగా, సమృద్ధిగా లభించే స్వచ్ఛమైన నీటి వనరుల చెంతనే ఆదివాసీల జీవనం ఒకప్పుడు సాగేది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం వారిని అన్నిటితో పాటూ గుక్కెడు నీళ్లకి కూడా దూరం చేసింది. దాహంతో అల్లాడే దుస్థితికి చేర్చింది. నేడు ఆదివాసీ ప్రాంతాల్లో సురక్షితమైన మంచి నీరు లభించదు. నిలవ నీరు తాగి వాంతులు, విరేచనాలు, జ్వరాల బారిన పడితే సాధారణమైన మాత్రలు సైతం అందక ఆదివాసులు పిట్టల్లా రాలిపోవాల్సి వస్తోంది.

‘అభివృద్ధి’ బలిపీఠంపై ఆదివాసీ మనుగడ

ఈ సమస్యలన్నీ ఇలా ఉండగా ఇటీవలి కాలంలో ఆదివాసీల మనుగడే ప్రశ్నార్థ కంగా మారుతోంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్వయం పాలన మాట అటుంచి అభి వృద్ధి పేరుతో అదివాసీలను అడవుల నుంచి తరిమివేసే విధానాన్ని ప్రభు త్వాలు బహిరంగంగానే అనుసరిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లోని ఖనిజ నిక్షే పాలే వారి పాలిట శాపాలవుతున్నాయి. ఆదివాసీలను బలి పశువులను చేసి, అటవీ సంపదను కొల్లగొట్టే కార్పొరేట్ శక్తులు చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఆదివాసుల సహజ హక్కయిన అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు, వ్యక్తులకు కట్టబెట్టేందుకు అన్ని చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోనైతే నక్సలైట్ల ఏరివేత సాకుతో, ‘గ్రీన్ హంట్’ పేరుతో వేలాదిగా ఆదివాసీలను వేటాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అటవీ ప్రాంతాల్లో వారు దిక్కులేని పక్షుల్లా బతుకుతున్నారు. ఏ ప్రభు త్వాలూ వారి బాధ్యతను తీసుకోవడం లేదు. అలాగే నిస్సిగ్గుగా మైదాన ప్రాం తాల అభివృద్ధి కోసం భద్రాచలం ప్రాంత ఆదివాసులను పశువులకన్నా హీనంగా లెక్కగట్టి, వారి అభిప్రాయాలకు కనీస విలువనైనా ఇవ్వకుండా పోల వరం ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టు తలపెట్టినా అక్కడి ఆదివాసీల అభిప్రాయాలను పరిగణనలోకి  తీసుకో వాలనే చట్టాలన్నా, రాజ్యాంగ సూత్రాలన్నా రాజ్యానికి లెక్కే లేదు. ఆదివాసీ హక్కుల పట్ల ఈ తృణీకార భావం ఈ నాటిదేమీ కాదు. భారతంలో పాండ వులు నూతన రాజధానిని నిర్మించుకోవడానికి ఖాండవ వన దహనం చేసి, నాగ జాతిని నాశనం చే శారని విన్నాం. నక్సలైట్ల ఏరివేత పేరుతో 20 సంవత్సరాల క్రితం చింతపల్లి అడవుల్లో పోలీసులు ఆదివాసీ గూడేలను తగులబెట్టారు. అయితే ఇక్కడ ఒక తాత్విక సమస్య ఉన్నది. గ్రామాల్లో అంటరానితనానికి బల వుతున్న దళితులు మనుషులు కాదు. అడవుల్లో అభివృద్ధికి దూరంగా ఉంటూ సమాజ అభివృద్ధికి సమిధలుగా మారుతున్న ఆదివాసీలు కూడా పౌరులు కారు. అంటే ఈ సమాజం ఇటు దళితులనుగానీ, అటు ఆదివాసీలనుగానీ పౌరులుగా గుర్తించడం లేదని అర్థం.

ఒకవేళ మన సమాజానికి ఆదివాసుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ముందుగా మనం మనసా, వాచా, కర్మణా వారిని సమాన స్థాయి పౌరులుగా గుర్తించాలి. అంటే వారి హక్కులను గౌరవించాలి, పరిరక్షించాలి. వారి సంస్కృతికి, వారి జీవన విధానానికి వారిని దూరం చేయకుండా, స్వేచ్ఛగా బతకనివ్వాలి. ప్రభు త్వం అందుకు అవసరమైన తోడ్పాటును అందించాలి. అంతే తప్ప అభివృద్ధి పేరుతో వారి జీవితాల్లో విధ్వంసం సృష్టిస్తే ఫలితాలు వేరుగా ఉంటాయి. కార్పొ రేట్ ఆర్థిక వ్యవస్థకు కాపలాదార్లుగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రభు త్వాలు ఈ సమస్యపై అంత తేలికగా స్పందించరు. మానవత్వం కలిగిన పౌర సమాజం ఆదివాసీల పక్షాన నిలబడాలి. వారి పోరాటాల్లో భాగం కావాలి. సామాజిక ప్రగతి ఫలాల్లో వారి వాటా వారికి అందేలా ఉద్యమించాలి. ఆ ఉద్యమాల్లో వారితో కలిసి అడుగు ముందుకు వేయాలి.
 
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)  మల్లెపల్లి లక్ష్మయ్య
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement