
సాక్షి, విజయవాడ: అపార నమ్మకంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత అలీ అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడం మామూలు విషయ కాదని, మిరాకిల్ అని వర్ణించారు. కొత్త ఇంటికి నవధాన్యాలు ఎంత ముఖ్యమో కొత్త రాజధాని అమరావతికి వైఎస్సార్‌సీపీ నవతర్నాల పథకాలు అంతముఖ్యమని అన్నారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రూపు తీసుకొస్తారని ఆకాంక్షించారు. నవతర్నాలతో మంచి పాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి వాతావరణం కూడా అనుకూలించిందన్నారు. జగన్ పాలనలో వర్షాలు సకాలంలో కురుస్తాయని అన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని చెప్పారు. మైనార్టీలంతా వైఎస్ జగన్‌కు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు.