సుర్వీ లావణ్య (ఫైల్ ఫొటో)
సాక్షి, భువనగిరి : రెండు నెలలుగా అనేక మలుపులు తిరుగుతున్న భువనగిరి మున్సిపల్ రాజకీయానికి తెరపడింది. జిల్లాలోనే ఏకైక మున్సిపాలిటీ అయిన భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని సుర్వి లావణ్య కోల్పోయింది. మంగళవారం ఆమెకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. మొత్తం 30 మంది సభ్యుల్లో.. ఆమెకు వ్యతిరేకంగా 22 మంది కౌన్సిలర్‌లు ఓటేశారు. దీంతో ఆమె పదవిని కోల్పోవాల్సి వచ్చింది. తొలుత బీజేపీ నుంచి గెలిచిన లావణ్య అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరి 4 ఏళ్లు చైర్‌పర్సన్‌గా పాలన కొనసాగించారు. అయితే ఇటీవల ఆమె అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎమ్మేల్యే పైల్ల శేఖర్ రెడ్డి ఆమె పదవి కోల్పోయేలా చేశారు. అవిశ్వాసం సందర్భంగా ఎమ్మేల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. అక్రమంగా కౌన్సిలర్లు కొనుగోలు చేశారని ఆరోపిస్తూ ధర్నా చేపట్టారు.
చిచ్చు ఇలా మొదలైంది..
మే30వ తేదీన 14ఎజెండా అంశాలతో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్ పర్సన్, అధికార టీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మధ్య చిచ్చు మొదలైంది. ఇది కాస్త తారస్థాయికి చేరింది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష కౌన్సిలర్లలో కొందరు చైర్‌పర్సన్‌పై అవిశ్వాసాన్ని తెరపైకి తెచ్చారు. అనంతరం వీరి మధ్య సయోధ్య కోసం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు అనుకూలంగా లేకపోవడంతో మున్సిపల్ చైర్‌పర్సన్ జూన్ 28న సొంతగూటి(బీజేపీ)లో చేరారు. ఈనెల 4వ తేదీ నాటికి పాలకవర్గానికి నాలుగు సంవత్సరాలు పూర్తి కావడంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం సభ్యులతో సహా మొత్తం 24మంది సంతకాలతో చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. అవిశ్వాసానికి తమ మద్దతు తెలుపుతామని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సంతకాలు చేసినప్పటికీ తమ ఇద్దరు కౌన్సిలర్లను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై ఆ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment