సాక్షి, న్యూఢిల్లీ : తయారీ రంగం కుంటుపడితే దేశంలో సామూహిక నిరుద్యోగం తలెత్తుతుందని నోబెల్ గ్రహీత పాల్ క్రుగ్‌మన్ చేసిన ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌ను టార్గెట్ చేశారు. గత రెండేళ్లుగా తాము చెబుతున్నదే ప్రఖ్యాత అమెరికన్ ఆర్థికవేత్త క్రుగ్‌మన్ చెప్పారని..అయినా ప్రధాని మోదీ అంగీకరించే పరిస్థితిలో లేరని రాహుల్ అన్నారు. అచ్ఛేదిన్‌పై ఊదరగొడుతున్న మోదీ నినాదం మసకబారుతుందని ఈ నివేదికను ప్రస్తావిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు. గత రెండేళ్లకు పైగా తాము చెబుతున్న విషయాలను నోబెల్ బహుమతి గెలుచుకున్న ఆర్థికవ్తేత పాల్ క్రుగ్‌మన్ ఇప్పుడు నిర్ధారించారని రాహుల్ వ్యాఖ్యానించారు.
తయారీ రంగాన్ని చక్కదిద్దకుంటే ఉపాధి రంగం కుదేలవుతుందన్న హెచ్చరికలను మోదీ పెడచెవిన పెడుతున్నారన్నారు. నిరుద్యోగంలో కూరుకుపోయిన యువత భారత్‌కు అతిపెద్ద సవాల్‌గా మారినా దురదృష్టవశాత్తూ మన ప్రధాని అంగీకరించే పరిస్థితిలో లేరని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై ఇటీవల క్రుగ్‌మన్ పలు వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తీవ్రస్ధాయిలో అసమానతలున్నాయని, దేశం ఆర్థికంగా అద్భుత ప్రగతి సాధిస్తున్నా..వాటి ఫలితాలు సమానంగా పంపిణీ కావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్ 150 ఏళ్లలో సాధించిన పురోగతిని భారత్ కేవలం మూడు దశాబ్ధాల్లోనే సాధించిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment