భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీలో మాట్లాడుతున్న మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ
న్యూఢిల్లీ : ఎన్నికలకు ముందు అవినీతితో పోరాడుతామని, సుస్థిరాభివృద్ధిని సాధిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న హామీలన్నీ అధికారంలోకి రావడానికి ఆడుతున్న డ్రామాలని భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం పార్టీ ప్లీనరీలో విమర్శించారు.
84వ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఏ త్యాగానికైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో వివక్ష, ప్రతీకార రాజకీయాలను తరిమికొట్టాలని అన్నారు. దేశంలో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్న పార్టీని కాపాడేందుకు ఎదురొడ్డి నిలవాలని కోరారు.
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ పేరుతో రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ట్రిక్కులు ప్లే చేస్తోందని ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలన్నీ ఒట్టిమాటలేనని దేశ ప్రజలకు మెల్లమెల్లగా అర్థం అవుతోందని అన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసిందని చెప్పారు.
లక్షల మంది నిరుపేదలను పేదరికం నుంచి బయటపడేసిన విధానాలను కాంగ్రెస్ పార్టీ అవలంభించిందని గుర్తు చేశారు. నేటి మోదీ ప్రభుత్వం ఆ పాలసీలను మరుగున పడేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేవలం అధికారమే పరమావధిగా మోదీ యంత్రాంగం పని చేస్తూ ప్రతిపక్షాలపై ప్రతీకారం సాధిస్తోందని అన్నారు. బీజేపీని గద్దె దించేందుకు దేశంలోని పార్టీలను కలుపుకుని వెళ్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment