న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తాజా సర్వేలో తేలింది. ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 279 సీట్లు గెలుచుకుని సాధారణ మెజారిటీతో వరసగా రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని టైమ్స్ నౌ–వీఎంఆర్ సర్వే తెలిపింది. పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వైమానిక దాడులు, రైతులకు పెట్టుబడి సాయం, అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు లాంటి నిర్ణయాలతో ప్రధాని మోదీకి ఆదరణ అమాంతం పెరిగిందని, ఇవే ఈసారి ఎన్నికలను మలుపు తిప్పబోతున్నట్లు పేర్కొంది. ఈ అంచనాలు నిజమైతే, ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ మెజారిటీ లభించినా 2014 ఎన్నికలతో పోలిస్తే ఎన్డీయే 50 సీట్లు కోల్పోనుంది. 43 శాతం మంది మరోసారి మోదీనే ప్రధానిగా కోరుకున్నారని సర్వే తెలిపింది. 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ కూటమి పోటీని తట్టుకుని బీజేపీ 50 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే గొప్పగా పుంజుకుని తన బలాన్ని 64 సీట్ల నుంచి 149కి పెంచుకుంటుందని తేల్చింది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్న తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ లాంటి పార్టీలకు 115 సీట్లు దక్కే అవకాశాలున్నాయని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఖాతా తెరవడం కష్టమేనని అభిప్రాయపడింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ 14, కాంగ్రెస్ 2, ఎంఐఎం 1, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ 20 స్థానాలు, టీడీపీ ఐదు స్థానాలు గెలుచుకుంటాయని తెలిపింది. 19 రాష్ట్రాల్లో సుమారు 14 వేల మంది అభిప్రాయాలు సేకరించి టైమ్స్ నౌ–వీఎంఆర్ సర్వే నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment