సాక్షి, సిటీబ్యూరో: మజ్లిస్ పార్టీకి ఎమ్మెల్యే కోటాలో మరోమారు ఎమ్మెల్సీ అవకాశం లభించింది. ఎమ్మెల్యే కోటాలో మిత్రపక్షమైన మజ్లిస్‌కు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తూ అధికార పక్షమైన టీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఎమ్మెల్యే కోటాలో ఎమెల్సీ అవకాశం లభించడం ఇదే తొలిసారి. ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ సహకారంతో ఎమ్యెల్యే కోటాలో రెండు పర్యాయాలు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. తాజాగా ఐదుగురు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో టీఆర్‌ఎస్ పార్టీ నాలుగు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించి మిగిలిన ఒక స్థానంలో మజ్లిస్‌కు అవకాశం కల్పించింది. అభ్యర్థి ఖరారు బాధ్యత మజ్లిస్ పార్టీకి వదిలివేసింది. దీంతో మజ్లిస్ పార్టీ ఒకటిరెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో సయ్యద్ అమీన్ జాప్రీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు ఆయన వరసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఎన్నికవుతూ వస్తున్నారు.
వైఎస్ హయాంలో..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యే కోటాలో మజ్లిస్ పార్టీకి తొలిసారిగా ఎమ్మెల్సీ అవకాశం లభించింది. అప్పట్లో మజ్లిస్ ఎమ్మెల్సీగా సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వీ ఎన్నికయ్యారు. తిరిగి 2011లో కూడా రెండోసారి ఆయన ఎన్నికయ్యారు. 2017తో ఆయన పదవీ కాలం పూర్తయినా తిరిగి మజ్లిస్ పార్టీ ఎమ్మెలే కోటాలో ఎమ్మెల్సీగా పోటీ చేయలేదు. తాజగా ఖాళీ అవుతున్న ఐదు స్ధానాలకు ఎన్నికలు జరుగుతుండటంతో అధికార పక్షమైన టీఆర్‌ఎస్ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి ఒక స్థానాన్ని మజ్లిస్‌కు అవకాశం ఇవ్వనుంది.
కేసీఆర్, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపిన అసద్
మజ్లిస్‌పార్టీకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోవు లోక్ సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్–మజ్లిస్ కలిసి 17 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment