నాలుగు నెలల్లోనే 4లక్షల ఉద్యోగాలు | YS Jagan Mohan Reddy Speech on Village Secretariat in Assembly | Sakshi
Sakshi News home page

నాలుగు నెలల్లోనే 4లక్షల ఉద్యోగాలు

Published Wed, Dec 11 2019 4:18 PM | Last Updated on Wed, Dec 11 2019 4:28 PM

YS Jagan Mohan Reddy Speech on Village Secretariat in Assembly - Sakshi

సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే అక్షరాల నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించడం అన్నది దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని, అటువంటి మహాత్తరమైన ఘట్టం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల ద్వారా అక్షరాల లక్షా 28వేల 858 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చామని, వాళ్లంతా గ్రామ సచివాలయాల్లో ఈ రోజు పనిచేస్తున్నారని, ఇది ఎంతో సంతోషం కలిగించే విషయమని ఆయన తెలిపారు. గ్రామసచివాలయాల అంశంపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ లాంటి ఇంపార్టెంట్‌ సబ్జెక్ట్‌ మీద చర్చలో చంద్రబాబు పాల్గొంటారని చాలా ఆశగా ఎదురుచూశానని, కాని తన ధోరణి మారదన్నట్టుగానే చంద్రబాబు రాలేదని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘దాదాపు 11వేలకుపైగా గ్రామ సచివాలయాలు, మూడువేల వరకు వార్డు సెక్రటేరియట్‌లు.. మొత్తం సుమారు 15వేల గ్రామ, వార్డు సెక్రటేరియట్లలో లక్షా 28వేల 858 మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. దాదాపుగా 20 లక్షలమంది ఎనిమిది రోజులపాటు గ్రామ సచివాలయ పరీక్షలకు హాజరయ్యారు. ఎంతో పారదర్శకంగా, అభ్యర్థులకు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా, ఎలాంటి అవాంతారాలు లేకుండా అధికారులు ఈ పరీక్షలను నిర్వహించారు. ఏ ఒక్కరూ కూడా వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించినందుకు అధికారులు, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిని అభినందిస్తున్నాను. సచివాలయ ఉద్యోగాలు పొందిన వారిలో 82.5శాతం మంది ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు ఉన్నారు. ఇందులో ఒక్క బీసీలే 51.9శాతం మంది ఉన్నారు. మొత్తం 82.5శాతం ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి ఉద్యోగాలు రావడం ఎంతో విప్లవాత్మక చర్య.

వీటికి అనుబంధంగా రెండులక్షల 65వేలకు పైచిలుకు గ్రామవాలంటీర్లను నియమించాం. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామవాలంటీర్‌ నియామకాన్ని చేపట్టాం. వారికి నెలనెలా రూ. 5వేల జీతం ఇస్తున్నాం. ఎక్కడైనా ఎవరైనా వివక్ష చూపినా, లంచాలు తీసుకున్నా, అవినీతికి పాల్పడినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కనెక్ట్‌ అయ్యేలా ఒక టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఇచ్చాం. అవినీతికి సంబంధించి ఈ టోల్‌ ఫ్రీ నంబర్‌కి ఎవరైనా ఫోన్‌చేస్తే వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించేస్తాం.

ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామవాలంటీర్‌ను నియమించి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా డోర్‌ డెలివరీ చేసేవిధంగా ఈ వ్యవస్థను రూపొందించాం. ప్రతి రెండువేల జనాబాకు ఒక గ్రామ సెక్రటేరియట్‌ ఉంటుంది. గ్రామవాలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్‌ రెండూ కలిపి ఆ రెండువేల జనాభాకు సంబంధించిన అన్ని అంశాలను చూడటమే కాకుండా.. ప్రతి ప్రభుత్వ సేవను డోర్‌ డెలివరీ చేయనున్నాయి. ఈ పథకంలో భాగంగా ప్రతి లబ్ధిదారుడికి మంచి జరిగేలా చూడటం. అర్హులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పథకం, ఆ పథకంలోని లబ్ధిదారుల వివరాలతో కూడిన జాబితాను గ్రామ సెక్రటేరియట్‌ బయట అతికించే విధానం తీసుకొస్తున్నాం. ఆ పథకానికి ఉన్న అర్హత ఏమిటి అన్నది కూడా జాబితానే పక్కనే అతికిస్తాం. ఎవరైనా అర్హులైన అబ్ధిదారులకు మిస్‌ అయితే.. వారు ఎలా నమోదుచేసుకోవాలో కూడా పక్కనే తెలియజేసేవిధంగా పోస్టర్లు అతికిస్తాం. దీనివల్ల అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా అనర్హులు ఎవరైనా లబ్ధిపొందినా తెలిసిపోతుంది. వారిని గ్రామసభలు, సోషల్‌ ఆడిట్‌ ద్వారా తొలగిస్తాం. ఈ రెండు చేసేందుకు పర్మినెంట్‌ సోషల్‌ ఆడిట్‌ మెకానిజాన్ని గ్రామ సెకట్రేరియట్లలో అంతర్భాగం చేస్తున్నాం.
 
దాదాపుగా 500 రకాల సేవలను గ్రామసెక్రటేరియట్లు అందించనున్నాయి. ఏయే సేవలు ఎన్నెన్ని రోజుల్లో అందజేస్తామనేది కూడా స్పష్టంగా తెలియజేసేవిధంగా డిస్‌ప్లే ఉంటుంది. వారానికి ఒక రోజు స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలు సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు అందుబాటులో ఉంటారు. సోమవారం స్పందనలో వచ్చిన సమస్యలు, వాటి పరిష్కారం అంశాన్ని మంగళవారం నేను నేరుగా సమీక్షిస్తున్నాను.  గ్రామ సెక్రటేరియట్‌లో జరిగే స్పందన కార్యక్రమం ద్వారా పూర్తిగా అభివృద్ధితో కూడిన పరిపాలన ముఖచిత్రం మారిపోతోబోతుంది. ఇది విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. ఈ చర్చలో చంద్రబాబునాయుడు కూడా పాల్గొని ఉంటే బాగుండేది. వాళ్లు ప్రవేశపెట్టిన జన్మభూమి కమిటీలు ఎలా ఫెయిలయ్యాయి.. గ్రామ సెక్రటేరియట్‌లు ఏవిధంగా సక్సెస్‌ అవుతున్నాయో సభలో చర్చ ఆయనకు తెలిసేలా ఉండేది’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. సభకు రాలేకపోయినా తన ప్రసంగాన్ని చంద్రబాబు టీవీలో చూస్తూ నాలెడ్జ్‌ పెంచుకుంటారని ఆయన ఛలోక్తి విసిరారు. అనంతరం సభను గురువారం ఉదయం 9 గంటలకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం వాయిదా వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement