సంక్రాంతి తర్వాత బాబును సాగనంపడమే.. | YSRCP Leaders Slams On Chandrababu Prakasam | Sakshi
Sakshi News home page

వైఎస్‌ ప్రారంభించారు.. జగన్‌ నీళ్లిస్తారు

Published Wed, Aug 29 2018 11:33 AM | Last Updated on Tue, Oct 16 2018 3:40 PM

YSRCP  Leaders Slams On Chandrababu Prakasam - Sakshi

ప్రజాపాదయాత్ర ముగింపు సభకు హాజరైన అశేష జన సందోహం, ఇన్‌సెట్‌లో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పక్కన ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావాలి.. పశ్చిమ ప్రకాశం రైతున్నలకు వ్యవసాయం పండుగ కావాలనే సత్‌ సంకల్పంతో స్వాతంత్య్ర దినోత్సవ శుభ తరుణాన ఆరంభమైన ప్రజా పాదయాత్ర 14 రోజుల పాటు సాగింది. ఐదు నియోజకవర్గాలు.. 69 గ్రామాల మీదుగా మొత్తం 207 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలనే డిమాండ్‌తో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. ఆయన చేపట్టిన కార్యం విజయవంతం కావాలని కాంక్షిస్తూ మహిళలు హారతులిచ్చి స్వాగతాలు పలికారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన నేతలు వైవీకి సంఘీభావం పలికారు.

ప్రాజెక్టు పూర్తి చేసే వరకు తన పోరాటం ఆగదని వైవీ ప్రతినబూనారు. అదిగో ప్రాజెక్టు.. ఇవిగో నీళ్లంటూ టీడీపీ సర్కారు ఏడాదికో ప్రకటనతో ప్రకాశం ప్రజల్ని మోసగిస్తోందని, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుని రాజన్నపాలన తెచ్చుకుందామని వైవీ ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలిగొండ పూర్తి చేసి, నీళ్లిస్తామని ప్రకటించగా ప్రజలు హర్షధ్వానాలు చేశారు. కనిగిరి పట్టణం నుంచి ప్రారంభమైన ప్రజా పాదయాత్ర పెద్దదోర్నాల మండలంలోని వెలిగొండ ఒకటో సొరంగమార్గం వద్ద మంగళవారం ముగిసింది. 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టును చంద్రబాబు పూర్తిగా గాలికొదిలారని, దివంగత నేత వైఎస్‌ నిధులిచ్చి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును ప్రజల ఆశీస్సులతో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యి వెలిగొండకు నీరిస్తారని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వెలిగొండ సాధన కోసం సుబ్బారెడ్డి ఈనెల 15 నుంచి చేపట్టిన ప్రజా పాదయాత్ర   మంగళవారం వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌ వద్దకు చేరింది. యాత్ర ముగింపు సందర్భంగా సాయంత్రం సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ పాదయాత్రలో తనతో కలిసి నడిచిన అందరికీ తొలుత వైవీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా ఆది నుంచి కరువు ప్రాంతమని, 33 లక్షల మంది జనాభా ఉండగా దాదాపు 12 లక్షల ఎకరాల సాగుభూమి ఉందని వైవీ చెప్పారు. 6.80 లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారని, 13 లక్షల మంది యువత, 3 లక్షల మంది పట్టభధ్రులు ఉన్నారన్నారు. జిల్లాలో 70 శాతం మందికి తాగునీరు అందడం లేదన్నారు. 50 శాతం భూములకు సాగునీరు లేక బీళ్లుగా ఉన్నాయన్నారు.

సంక్రాంతి తర్వాత బాబును సాగనంపడమే..
ప్రకాశం జిల్లాపై దివంగత నేత వైఎస్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టి, చంద్రబాబు రాకముందే వెలిగొండ 75 శాతం పనులు పూర్తి చేశారన్నారు.  13 ఏళ్ల పాలనలో చంద్రబాబు వెలిగొండను పట్టించుకోలేదని వైవీ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి 2014 నుంచి ఏటా నీళ్లిస్తానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. నాలుగేళ్లు దాటినా పనులు పూర్తి కాలేదని విమర్శించారు. 13 ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం దక్కలేదని, వారి భూములు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ద్వారా వారికి న్యాయం చేయాలని వైవీ డిమాండ్‌ చేశారు. అందుకే 14 రోజుల పాటు పాదయాత్ర చేశానన్నారు. వెలిగొండ పూర్తి అయితేనే పశ్చిమ ప్రాంతానికి బతుకని, ఫ్లోరైడ్‌ను పారదోలే అవకాశం ఉంటుందని చెప్పారు. సంక్రాంతి తర్వాత చంద్రబాబును ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదిలోనే ఫేజ్‌–1లో 1.20 లక్షల ఎకరాలకు నీరిస్తామని, 3వ టన్నెల్‌ తవ్వి అయినా కొండపి, పొన్నలూరులకు నీరిస్తామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు.
 
ముగిసిన పాదయాత్ర : 
వెలిగొండ ప్రాజెక్టు సాధన కోసం ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈనెల 15న కనిగిరి నుంచి చేపట్టిన పాదయాత్ర కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలో 69 గ్రామాల గుండా 14 రోజుల పాటు 207 కిలో మీటర్లు సాగింది. చివరి రోజు మంగళవారం పాదయాత్ర వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన టన్నెల్‌–1కు చేరింది. సాయంత్రం ఇక్కడే బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా పాదయాత్ర పైలాన్‌ను ఆవిష్కరించారు. వెలిగొండ ప్రాజెక్టు తాజా పరిస్థితిపై పుస్తక ఆవిష్కరణ నిర్వహించారు.

కార్యక్రమంలో నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ మంత్రులు మానుగుంట మహీధర్‌రెడ్డి, పార్థసారధి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, పిడతల సాయి కల్పనారెడ్డి, జక్కంపూడి రాజా, బాపట్ల సమన్వయకర్త సురేష్, పార్టీ అధికార ప్రతినిధులు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కాకుమాని రాజశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్తలు బాదం మాధవరెడ్డి, రావి రామనాథంబాబు, బుర్రా మధుసూదన్‌యాదవ్, సుధాకర్‌బాబు, ఐవీ రెడ్డి, యడం బాలాజీ, బాచిన చెంచు గరటయ్య, నాయకులు బియ్యపు మధుసూధన్‌రెడ్డి, వెన్నా హనుమారెడ్డి, వరికూటి అశోక్‌బాబు, చుండూరు రవి, కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, సింగరాజు వెంకట్రావ్, కుప్పం ప్రసాద్, రామారావు, పి.చంద్రమౌళేశ్వరరెడ్డి, ఆదినారాయణ, మధుసూదన్‌రెడ్డి, జెట్పీటీసీ సభ్యులు అమిరెడ్డి రామిరెడ్డి, దుగ్గెంపూడి వెంకటరెడ్డి, ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, నాయకులు కన్వీనర్లు జంకె ఆవులరెడ్డి, దొంతా కిరణ్‌గౌడ్, పి.చంద్రమౌళిరెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, షేక్‌.జబీవుల్లా, కె.ఓబులరెడ్డి, ఎం.బాలగురవయ్య, కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, పులుగు అక్కిరెడ్డి, పటా పంజుల అశోక్, షేక్‌.అబ్దుల్‌మజీద్, గంటా గురువారెడ్డి, వై.లింగారెడ్డి, కె.మల్లారెడ్డి, ఎ.రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

వెలిగొండపై సవాల్‌కు సిద్ధమా..?  

ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి నీటిని విడుదల చేస్తే తాను విసిరిన సవాల్‌కు కట్టుబడి గుండు గీయించుకుంటానని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మరోమారు స్పష్టం చేశారు. సంక్రాంతి నాటికి నీరు ఇవ్వలేకపోతే జిల్లాకు చెందిన మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఏం చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని బాలినేని ధ్వజమెత్తారు. జిల్లాకు బాబు ఒరగపెట్టింది శూన్యమన్నారు. ప్రజా పాదయాత్ర ముగింపు సభలో బాలినేని ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. పశ్చిమ ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు వర ప్రదాయని అన్నారు. ఈ ప్రాంతం సశ్యశ్యామలం కావాలని దివంగతనేత వైఎస్‌ కలలు కన్నారన్నారు. 1996లో చంద్రబాబు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఒక్క పైసా ఇచ్చి పనులు మొదలు పెట్టలేదని బాలినేని విమర్శించారు.

2003 ప్రాంతంలో వైఎస్‌ జిల్లాకు వచ్చి తాను సీఎం అయితే వెలిగొండ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆమేరకు రూ.3వేల కోట్లకు పైగా నిధులిచ్చి పనులు 70 శాతం పైగా పూర్తి చేశారన్నారు. నిధులిచ్చి పనులు చేయకుండానే చంద్రబాబు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది తానేనని, నీళ్లిచ్చేది కూడా తానేనని చెప్పడం సిగ్గుచేటన్నారు. టెంకాయ కొడితే ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలన్నారు. సంక్రాంతికి నీరిస్తానంటూ చంద్రబాబు జనాన్ని వంచించే ప్రయత్నంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు బాబు చేసింది శూన్యమన్నారు. వైఎస్‌ హయాంలోనే గుండ్లకమ్మ, రామతీర్థం, ఉలుచి చెక్‌డ్యామ్‌ తదితర పనులు పూర్తయ్యాయన్నారు. చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను పెంచి పోషించేందుకే నీరు చెట్టు పనులు ప్రవేశపెట్టారన్నారు. అవి ప్రజల కోసం కాదని బాలినేని విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

సభలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి, వేదికపై వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement