లండన్: ఇంగ్లండ్‌లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని కరోనా మింగేసింది. టెన్నిస్ ప్రియుల్ని ఈ అంశం బాధించింది. అయితే ఫార్ములావన్‌కు (ఎఫ్1) మాత్రం ఈ గండం లేదు. ప్రీమియం స్పోర్ట్ ఈవెంట్ అయిన ఫార్ములావన్ రేసులకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సిల్వర్‌స్టోన్ వేదిక ‘లాక్‌డౌన్’ నుంచి ‘ఓపెన్’ కానుంది. ఇక్కడ జరిగే రెండు రేసుల్లో పాల్గొనే వారి కోసం 14 రోజుల క్వారంటైన్ నిబంధనకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీంతో సిల్వర్‌స్టోన్ సర్క్యూట్ ‘రయ్ రయ్’ కూతతో మోతెక్కనుంది. జూలై, ఆగస్టులో ఇక్కడ రెండు రేసులు జరుగనున్నాయి.
బ్రిటన్ నిర్ణయంపై ఫార్ములావన్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ సీజన్‌లో రేసులు మళ్లీ మొదలయ్యేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. దీనిపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం సూచించే ముందు జాగ్రత్త చర్యలతో ముందడుగు వేస్తాం. ఈ రేసుల కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తాం’ అని ఎఫ్1 అధికారి ఒకరు వెల్లడించారు. సిల్వర్‌స్టోన్ సర్క్యూట్ కంటే ముందుగా... జూలై 5, 12వ తేదీల్లో ఆస్ట్రియాలో, 19న హంగేరీలో ఎఫ్1 రేసులు జరుగనున్నాయి. మొత్తానికి ఇంగ్లండ్‌లో ఆటలకు గేట్లు ఎత్తేయనున్నారు. దీంతో చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్‌తోపాటు క్రికెట్ సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment