ధోనీలా కూల్గా వ్యవహరిస్తా: కోహ్లీ
సిడ్నీ: మాజీ కెప్టెన్ ధోనీ తరహాలో ప్రశాంతంగా జట్టును నడిపిస్తానని భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్గా ఎంపికైన విరాట్ కోహ్లీ అన్నాడు. మంగళవారం నుంచి భారత్, ఆస్ట్రేలియాల చివరి, నాలుగో టెస్టు జరగనుంది. కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. ధోనీ ప్రతికూల పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటాడని తాను కూడా అదే పద్ధతి పాటిస్తానని అన్నాడు.
'మెల్బోర్న్ టెస్టు ముగిసిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్లో లగేజి సర్దుకుంటున్నాం. ధోనీ వచ్చి జట్టు సభ్యులకు ఓ విషయం చెబుతానని అన్నాడు. టెస్టుల నుంచి రిటైరవుతున్నట్టు చెప్పాడు. ఈ వార్త వినగానే అందరూ షాక్కు గురయ్యాం. ఏం మాట్లాడాలో మాకు అర్థం కాలేదు. ధోనీకది భావోద్వేగ సందర్భం. మాకు కూడా. అతని కెప్టెన్సీలో మేం కెరీర్ ఆరంభించాం. ధోనీ నుంచి ఎంతో నేర్చుకున్నాం. కీలక సమయాల్లో ధోనీ తీసుకునే సాహసోపేత నిర్ణయాలు, ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండగలగడం వంటి లక్షణాలు మాకందరికీ ఆదర్శం. మహీ నాయకత్వ లక్షణాలను ప్రతి కెప్టెన్ ఇష్టపడతాడు. నేను కూడా అతని బాటలోనే నడుస్తా' అని కోహ్లీ చెప్పాడు.