ఆసియా కప్కు ధోనీ దూరం.. కోహ్లీకి కెప్టెన్సీ
గాయం కారణంగా పది రోజుల విశ్రాంతి
కోహ్లికి సారథ్య బాధ్యతలు జట్టులో కార్తీక్
న్యూఢిల్లీ: ఆసియాకప్‌కు ముందు భారత జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఎడమ పక్కటెముకల్లో గ్రేడ్ 1 గాయం కారణంగా కెప్టెన్ ధోని ఆసియాకప్‌కు దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన రెండో టెస్టులో ధోని ఎడమ పక్కటెముకల్లో గాయమైంది. ప్రస్తుతం 10 రోజుల పునరావాస చికిత్స (రిహాబిలిటేషన్)లో ఉన్న ధోని టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ధోని అందుబాటులో లేకపోవడంతో విరాట్ కోహ్లి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ధోని స్థానంలో దినేశ్ కార్తీక్‌ను వికెట్‌కీపర్‌గా ఎంపిక చేసినట్లు సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.
ఇటీవల ఐపీఎల్ వేలంలో తను రూ. 12.5 కోట్లకు అమ్ముడుపోయి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ నెల 25 నుంచి మార్చి 8 వరకు బంగ్లాదేశ్‌లో జరిగే ఆసియాకప్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ పాల్గొంటున్నాయి. 26న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా టోర్నీని మొదలు పెడుతుంది. 28న శ్రీలంకతో, మార్చి 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో, 5న అఫ్ఘానిస్తాన్‌తో తలపడుతుంది.
మూడోసారి
ధోని స్థానంలో భారత జట్టు పగ్గాలు చేపట్టడం విరాట్ కోహ్లికిది మూడోసారి. గత ఏడాది జూలైలో వెస్టిండీస్ పర్యటనలో ధోనికి గాయం కారణంగా ముక్కోణపు సిరీస్‌లో మూడు మ్యాచ్‌లకు కోహ్లి సారథ్యం వహించాడు. ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలోనూ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 5-0తో జింబాబ్వేపై విజయం సాధించింది. మొత్తానికి కోహ్లి కెప్టెన్సీలో భారత్ 8 మ్యాచ్‌లు ఆడి ఏడింట నెగ్గింది. ఒక మ్యాచ్‌లో ఓడింది. మరోవైపు న్యూజిలాండ్ పర్యటనలో జట్టు ఒక్క విజయం కూడా సాధించకపోవడంతో ప్రస్తుతం ధోని కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కోహ్లిపై ఉంది. సొంతగడ్డపై, విదేశాల్లో ఆటగాడిగా నిలకడగా రాణిస్తున్న కోహ్లి.. కెప్టెన్‌గా ఆసియాకప్‌లో ఏం చేస్తాడో చూడాలి.