న్యూజిలాండ్ సొంతగడ్డపై ఆడుతున్నదా? లేక భారత్‌లోనా? అన్నంత సందేహం! క్రీజులో ఉన్నది కివీస్ బ్యాట్స్‌మెనేనా? మరేదైనా పసికూన జట్టు ఆటగాళ్లా? అన్నంత అనుమానం! అటువైపు నిప్పులు చెరుగుతున్న షమీ... ఇటువైపు చహల్, కుల్దీప్‌ల మణికట్టు కనికట్టు! వెరసి... ఆతిథ్య దేశం కుప్పకూలింది! బ్యాటింగ్‌లో ధావన్, కోహ్లి నిలకడతో తొలి వన్డేలో టీమిండియాకు ఘన విజయం సొంతమైంది.
నేపియర్: అందరూ కఠినం అనుకుంటున్న న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా చక్కటి ప్రదర్శన ద్వారా ఘన విజయంతో ప్రారంభించింది. పేసర్ మొహమ్మద్ షమీ (3/19) అద్భుత బౌలింగ్‌కు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/39), యజువేంద్ర చహల్ (2/43) మాయాజాలం తోడవడంతో బుధవారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో కివీస్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. మన బౌలర్ల ప్రతాపంతో కనీస పోరాటమూ చూపలేకపోయిన ఆతిథ్య జట్టు 38 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (81 బంతుల్లో 64; 7 ఫోర్లు) ఒక్కడే అర్ధ సెంచరీతో పోరాడాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ (41 బంతుల్లో 24; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆటగాళ్ల కళ్లకు నేరుగా సూర్య కిరణాలు తాకుతున్న కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో... భారత్ లక్ష్యాన్ని 49 ఓవర్లలో 156 పరుగులుగా నిర్దేశించారు. దీనిని టీమిండియా 34.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (103 బంతుల్లో 75 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీకి తోడు కెప్టెన్ కోహ్లి (59 బంతుల్లో 45; 3 ఫోర్లు) రాణించాడు. ఆరంభంలోనే ప్రత్యర్థి వికెట్లు పడగొట్టి, మ్యాచ్‌ను మలుపుతిప్పిన షమీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం మౌంట్ మాంగనీలో జరుగనుంది.
షంషేర్ షమీ...
మొదటి బంతి ఓపెనర్ గప్టిల్ బ్యాట్ ఎడ్జ్... రెండో బంతి ఎల్బీ అప్పీల్... మూడో బంతికీ ఎల్బీ అప్పీలే! షమీ తొలి ఓవర్ ఎంత ప్రభావవంతంగా ప్రారంభమైందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు అతడు చుక్కలు చూపాడు. ఫ్లాట్ పిచ్ అయినప్పటికీ కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో నిప్పులు చెరుగుతున్న షమీని ఎదుర్కొనడం తనవల్ల కాదన్నట్లు గప్టిల్ (5) ఐదో బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. అదే ఊపులో పదునైన డెలివరీతో మరుసటి ఓవర్లో మున్రో (8) వికెట్లను గిరాటేశాడు. ఆచితూచి ఆడిన విలియమ్సన్, టేలర్ 11 ఓవర్ల పాటు మరో వికెట్ పడకుండా చూశారు. అయితే, చహల్ వేగాన్ని మారుస్తూ వేసిన బంతికి తికమకపడిన టేలర్, ఫుల్ డెలివరీని డ్రైవ్ చేయబోయి విఫలమైన లాథమ్ (11) అతడికే క్యాచ్‌లు ఇచ్చారు. విలియమ్సన్ అండతో ఐదో వికెట్‌కు 31 బంతుల్లో 31 పరుగులు జోడించిన నికోల్స్ (12) జాదవ్ బౌలింగ్‌లో మిడ్ వికెట్‌లో కుల్దీప్ పట్టిన క్యాచ్‌కు ఔటయ్యాడు. 24వ ఓవర్ ముగిసేసరికి సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. విలియమ్సన్ అర్ధ సెంచరీ (63 బంతుల్లో) అందుకున్నాక రెండో స్పెల్‌కు దిగిన షమీ... సాన్‌ట్నర్ (14)ను ఎల్బీ చేశాడు. ఇక్కడి నుంచి కుల్దీప్ మాయ మొదలైంది. అప్పటివరకు 7 ఓవర్లలో 30 పరుగులిచ్చి ఒక్క వికెట్టూ తీయలేకపోయిన అతడు... తర్వాత మూడు ఓవర్లలో 9 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.
సునాయాసంగా...
ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ (11) త్వరగానే వెనుదిరిగినా భారత్‌కు పెద్దగా ఇబ్బంది ఎదురవలేదు. నిలదొక్కుకున్నాక ధావన్ చక్కటి షాట్లు కొట్టాడు. లక్ష్యం చిన్నదే కావడంతో కోహ్లితో కలిసి నింపాదిగా ఆడుకుంటూ పోయాడు. 32 పరుగుల వద్ద లైఫ్ దక్కిన శిఖర్ 69 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయానికి 24 పరుగులు అవసరమైన స్థితిలో కోహ్లి... ఫెర్గూసన్ బౌలింగ్‌లో కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ధావన్, రాయుడు (13 నాటౌట్) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి (10,430) వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో బ్రియాన్ లారా (10,405)ను వెనక్కి నెట్టి పదో స్థానానికి చేరాడు.
సూర్యుడు... ఆట ఆపాడు
క్రికెట్‌కు వర్షం అంతరాయం గురించి విన్నాం... ప్రేక్షకుల అతితో ఆట ఆగడాన్ని చూశాం... అధ్వాన పిచ్‌ల కారణంగా మ్యాచ్ అర్ధంతరంగా రద్దవడాన్ని గమనించాం! ఇవేవీ కా కుండా ‘సూర్యుడి’ వల్ల్ల ఇబ్బంది తలెత్తుతుందని ఊహించి ఉండం. కానీ, నేపియర్ డే నైట్ వన్డేలో భారత ఇన్నింగ్స్ పదో ఓవర్ సందర్భంగా ఇదే జరిగింది. ఇక్కడి మెక్‌లీన్ పార్క్ మైదానంలోని పిచ్ తూర్పు–పశ్చిమ దిశలో ఉండటంతో అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు నేరుగా బ్యాట్స్‌మెన్ కంట్లో పడసాగాయి. క్రీజులో ఉన్న కోహ్లి, ధావన్‌లకు ఇబ్బంది ఎదురైంది. ఫీల్డ్ అంపైర్లు సైతం పరిస్థితిని గ్రహించారు. దీంతో ఆటను నిలిపివేశారు. సూర్యుడు పూర్తిగా విశ్రమించాక 36 నిమిషాల అనంతరం పునః ప్రారంభమైంది. ‘ఇది నవ్వు తెప్పించే ఘటన. 2014లో ఓసారి ఇలాగే నేను ఔటయ్యా. అప్పుడు ఆటను ఆపే నిబంధనేదీ లేదు’ అని మ్యాచ్ అనంతరం కోహ్లి వ్యాఖ్యానించాడు.
కోహ్లికి విశ్రాంతి
న్యూజిలాండ్‌తో జరుగనున్న 4, 5 వన్డేలు, మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ నుంచి కెప్టెన్ కోహ్లికి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. రెండు, మూడు నెలలుగా తీరిక లేకుండా ఆడుతున్న కోహ్లిపై మరింత ఒత్తిడి పడకుండా ఉండేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జట్టుకు ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడు. కోహ్లి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయలేదు.
షమీ... 100 కొట్టాడు
న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో అద్భుత స్పెల్‌తో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన షమీ... కెరీర్‌లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా (56వ మ్యాచ్) ఈ ఘనత సాధించిన భారత బౌలర్‌గానూ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇర్ఫాన్ పఠాన్ (59 మ్యాచ్‌లు) పేరిట ఉంది. మ్యాచ్‌లో కివీస్ ఓపెనర్ గప్టిల్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన షమీ... అతడిని ఔట్ చేయడం ద్వారానే ఈ ఘనత సాధించడం గమనార్హం. కొంతకాలంగా టెస్టులకే పరిమితమైన అతడు... బుమ్రాకు విశ్రాంతితో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై వన్డే సిరీస్‌లు ఆడుతున్నాడు. ‘చాలాకాలం తర్వాత పునరాగమనం చేశా. పునరావాస శిబిరంలో ప్రపంచ శ్రేణి సదుపాయాల మధ్య సాధన చేశా. కోహ్లి ఎప్పు డూ నా వెన్నంటే నిలిచాడు. జట్టు మేనేజ్‌మెంట్, సహాయక సిబ్బంది పూర్తిగా సహకరించారు. మేం సాధించినదంతా జట్టుగా చేసినదే. వాతావరణం మినహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పిచ్‌లు ఒకేలా ఉన్నాయి. పరిస్థితులను ఆకళింపు చేసుకోవడమే ముఖ్యం’ అని షమీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment