విజయానికి 320 పరుగుల దూరంలో టీమిండియా
తొలి ఇన్నింగ్స్లో తడబడినా, రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి భారత బౌలర్లు విజృంభించారు. దీంతో ఆతిథ్య జట్టును 105 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా, విజయాన్ని అందుకోవాలంటే మరొక్క 320 పరుగులు చేస్తే చాలు. మొత్తం విజయలక్ష్యం 407 పరుగులు కాగా, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 87/1 స్కోరుతో ధీమాగా ఉంది. మొదటి ఇన్నింగ్స్లో 202 పరుగులకే చాప చుట్టేసిన టీమిండియా.. ఆతిథ్య కివీస్ జట్టు కంటే 301 పరుగులు వెనకబడింది. దాంతో మ్యాచ్ చేజారినట్లేనని అంతా నిరాశపడుతున్న సమయంలో ఒక్కసారిగా భారత బౌలర్లు జూలు విదిల్చారు.
న్యూజిలాండ్ బ్యాట్స్మన్ నుంచి పరుగుల వరద మళ్లీ వస్తుందని అభిమానులు ఆశిస్తుంటే, అందుకు భిన్నంగా జరిగింది. 41.2 ఓవర్లలో 105 పరుగులకే కివీస్ జట్టును పెవిలియన్ దారి పట్టించారు. దీంతో ఒక్క మూడోరోజే ఈడెన్ పార్కు మైదానంలో ఏకంగా 17 వికెట్లు టపటపా రాలిపోయినట్లయింది. రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ మాత్రమే 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరును చేరుకున్నారు.
పేసర్లు ఇషాంత్ శర్మ (3/28), మహ్మద్ షమీ (3/38), రెచ్చిపోయి ఆరు వికెట్లు తీసుకోగా, వెటరన్ జహీర్ ఖాన్ (2/23) కూడా వారికి తోడయ్యాడు.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సౌతీ బౌలింగులో వాట్లింగ్ క్యాచ్ పట్టడంతో మురళీ విజయ్ 13 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టాడు. అయితే హిట్టర్ శిఖర్ ధవన్ 49 పరుగులతోను, యువ సంచలనం ఛటేశ్వర్ పుజారా 22 పరుగులతోను క్రీజ్లో ఉన్నారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. మూడోరోజు చిట్ట చివరి బంతికి సోధీ ఎల్బీడబ్ల్యు అప్పీల్ చేసినా, అంపైర్ నిర్ణయం మాత్రం ధావన్కు అనుకూలంగానే వచ్చింది. ఇప్పుడు 407 పరుగుల లక్ష్యాన్ని గనక టీమిండియా ఛేదిస్తే, ఇది టెస్టు చరిత్రలోనే రెండో అతి పెద్ద ఛేజింగ్ అవుతుంది. ఆ రికార్డు భారత జట్టుకు సొంతం అవుతుంది. ఇంతకుముందు 2003లో 418 పరుగుల విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్ ఛేదించి టాప్ రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు టెస్టు క్రికెట్లో కేవలం మూడుసార్లు మాత్రమే 400పైగా లక్ష్యాన్ని ఛేదించారు. ఆ జాబితాలో భారత్ కూడా ఉంది. వెస్టిండీస్ జట్టు నిర్దేశించిన 406 పరుగుల లక్ష్యాన్ని 1976లోనే ఛేదించింది. అదే సంవత్సరంలో ఇంగ్లండ్ జట్టు పెట్టిన 404 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది.