ఆటగాళ్లకు విశ్రాంతి కావాలి
బిజీ షెడ్యూల్‌పై టీమిండియా కోచ్ రవిశాస్త్రి అసంతృప్తి
ముంబై: దాదాపు రెండు నెలలపాటు సాగిన శ్రీలంక పర్యటనలో భారత క్రికెట్ జట్టు మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టి20 ఆడి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘంగా సాగిన ఈ పర్యటన అనంతరం జట్టు తగిన విశ్రాంతి తీసుకోవడం లేదు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 13 వరకు ఆస్ట్రేలియాతో ఐదు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా... ఈ సిరీస్ ముగిసిన నాలుగు రోజులకే నవంబర్ 7 వరకు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇక్కడైనా ఆగారా అంటే అదీ లేదు. కివీస్‌తో సిరీస్ ముగిసిన వారం రోజుల అనంతరం భారత్‌కు రానున్న శ్రీలంక జట్టుతో డిసెంబర్ 24 వరకు వన్డే సిరీస్ ఉంటుంది. లంకతో సిరీస్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత డిసెంబర్ 28న దక్షిణాఫ్రికా పర్యటనకు కోహ్లి సేన వెళ్లాల్సి ఉంటుంది. ఇక అక్కడ మూడు టి20, మూడు వన్డేలు, నాలుగు టెస్టులు ఆడాక స్వదేశానికి వస్తుంది.
మా అభిప్రాయాలు తీసుకోండి...
అలుపెరగని రీతిలో ఉన్న భారత బిజీ షెడ్యూల్‌పై సహజంగానే జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లకు తగిన విశ్రాంతి లేకుండా అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లు ఉండటం జట్టుకు చేటు తెస్తుందని అన్నారు. ఇదే విషయమై ఆయన పరిపాలకుల కమిటీ (సీఓఏ)తో వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా చర్చించారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తమ ఆటగాళ్లకు ఏవిధంగా విశ్రాంతినిచ్చి కాపాడుకుంటున్నాయో వివరించారు.
వారికి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కూడా క్రిస్‌మస్ బ్రేక్ కింద స్వదేశానికి వచ్చేలా వెసులుబాటు ఉంటుందని గుర్తుచేశారు. ఇప్పుడు భారత జట్టు కివీస్‌తో ఆడే వన్డే సిరీస్ దీపావళి సమయంలోనే ఉంటుంది. కానీ మన ఆటగాళ్లకు వారి ఇళ్లకు వెళ్లి వచ్చే వీలుండదు. అయితే ప్రస్తుత పరిస్థితిలో షెడ్యూల్‌పై ఏమీ చేయలేమని బోర్డు అశక్తత వ్యక్తం చేసింది. కనీసం భవిష్యత్‌లోనైనా టూర్ల షెడ్యూల్ సమయంలో కెప్టెన్, కోచ్‌ల అభిప్రాయాలను తీసుకోవాలని శాస్త్రి బీసీసీఐకి సూచించారు.
శాస్త్రి సూచనలను పరిగణిస్తాం...
మరోవైపు రవిశాస్త్రి సూచనలను పరిగణలోకి తీసుకుంటామని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి తెలిపారు. ‘ప్రస్తుత కాలంలో అంతర్జాతీయ క్యాలెండర్ విరామం లేకుండా ఉంటోంది. మ్యాచ్‌లతో పాటు సుదీర్ఘ విమాన ప్రయాణాలతో ఆటగాళ్లు తీవ్రంగా అలసిపోతుంటారు. ఈ విషయంపై ఆలోచించాలని శాస్త్రి మాతో చెప్పారు. విరామం ఉంటే ఆటగాళ్లు వేగంగా కోలుకుంటారన్నారు. ఇంగ్లండ్, ఆసీస్ జట్లు తమ సిరీస్‌ల మధ్య తగిన విరామం ఉండేలా చూసుకుంటారు. ఇలాగే బీసీసీఐ కూడా ఇదే విధంగా ఆలోచించాల్సి ఉంటుంది. అప్పుడు ఆటగాళ్ల సంక్షేమాన్ని కూడా పట్టించుకున్నట్టవుతుంది’ అని జోహ్రి అన్నారు.