భారత్ ‘పసిడి’ గురి
♦ తొలిసారి స్వర్ణం నెగ్గిన పురుషుల కాంపౌండ్ జట్టు
♦ ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ
షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నమెంట్‌లో భారత జట్టు ‘గురి’ అదిరింది. కాంపౌండ్ ఈవెంట్‌లో పురుషుల జట్టు పసిడి పతకంతో మెరిసింది. ప్రపంచకప్ కాంపౌండ్ విభాగం చరిత్రలో భారత్‌కిదే తొలి స్వర్ణం కావడం విశేషం. శనివారం జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ, రాజు చిన్న శ్రీధర్, అమన్‌జీత్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 226–221 స్కోరుతో కార్డొనా, డానియెల్ మునోజ్, కార్లొస్‌లతో కూడిన కొలంబియా జట్టును కంగుతినిపించింది.
ఫైనల్లో భారత బృందం మూడు ప్రయత్నాల్లో నాలుగు సార్లు పదికి పది పాయింట్లు సాధించింది. ఈ నాన్–ఒలింపిక్ ఈవెంట్ తొలి ప్రయత్నంలో 58–57తో ముందంజ వేసిన భారత జట్టు... రెండో ప్రయత్నంలోనూ 58–56తో కొలంబియన్లపై ఆధిక్యాన్ని చాటుకుంది. దీంతో 116–113 పాయింట్లతో పైచేయి సాధించింది. మూడో ప్రయత్నంలో తడబడినప్పటికీ (52–52)... భారత్ 168–165 ఆధిక్యంలోనే నిలిచింది.
చివరి ప్రయత్నంలో భారత బృందం మళ్లీ పదికి పది పాయింట్లను సాధించడంతో (58–56) విజయం ఖాయమైంది. ఒలింపిక్ ఈవెంట్ అయిన రికర్వ్ ఈవెంట్ (వ్యక్తిగత)లో అతాను దాస్, దీపిక కుమారి క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించారు. కాంపౌండ్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో అభిషేక్ వర్మ–జ్యోతి సురేఖ జోడి నిరాశ పరిచింది. కాంస్య పతక పోరులో ఈ జంట 151–153తో రియో విల్డే–జెమి వాన్ నటా (అమెరికా) ద్వయం చేతిలో పరాజయం చవిచూసింది.