ఐఎస్‌ఎల్ ట్రోఫీ ఆవిష్కరణ
ముంబై: భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెంచే ఉద్దేశంతో ప్రారంభం కానున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీంట్లో భాగంగా ఆదివారం ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ (ఎఫ్‌ఎస్‌డీ) చైర్‌పర్సన్ నీతా అంబానీ ఐఎస్‌ఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఆమెతో పాటు ఈ కార్యక్రమంలో ఆయా ఫ్రాంచైజీల తరఫున బరిలోకి దిగబోతున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజాలు ఫ్రెడెరిక్ జుంగ్‌బర్గ్, డెల్ పియరో, క్యాప్‌డెవిలా, డేవిడ్ ట్రెజెగుట్, రాబర్ట్ పిరాస్, లూయిస్ గార్సియా, డేవిడ్ జేమ్స్ పాల్గొన్నారు. ‘ఇది నిజంగా మా అందరికీ చిరస్మరణీయ రోజు. ఐఎస్‌ఎల్ ట్రోఫీని ఆవిష్కరించేందుకు నేను ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాల సరసన నిలబడ్డాను. విశ్వవ్యాప్తంగా వీరు ఇప్పటికే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. భారత్‌లో కూడా వర్ధమాన ఆటగాళ్లకు ఐఎస్‌ఎల్ ట్రోఫీ ప్రేరణగా నిలుస్తుంది’ అని నీతా అంబానీ తెలిపారు. ఫ్రేజర్ అండ్ హాస్ డిజైన్ చేసిన ఈ ట్రోఫీ 26 అంగుళాల ఎత్తు ఉంది. పైభాగంలో ఐఎస్‌ఎల్ లోగోను ముద్రించారు.