ముంబై ఇండియన్స్‌కు గెలుపు మురిపెం.. గత మూడు మ్యాచ్‌ల్లో టాస్ ఓడి... మొదట బ్యాటింగ్‌కు దిగి... చివరి ఓవర్‌లో పరాజయం పాలైన ఆ జట్టు... ఈ సారీ టాస్ ఓడినా, మొదట బ్యాటింగే చేసినా, విజయం ఖాయం చేసుకునేందుకు ఆఖరి ఓవర్ వరకు ఎదురుచూడాల్సిన పని లేకపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై తమ సొంత మైదానం వాంఖెడేలో కెప్టెన్ రోహిత్ శర్మ ఘనమైన బ్యాటింగ్ రికార్డును కాపాడుకుంటూ చెలరేగడంతో ముంబై ఖాతా తెరిచింది.
ముంబై: కెప్టెన్ల మధ్య బ్యాటింగ్ సమరమా? అన్నట్లు సాగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లిపై రోహిత్ శర్మదే పైచేయి అయింది. ప్రారంభంలో తడబడినా నిలదొక్కుకుని ఆడిన ముంబై ఇండియన్స్... రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 46 పరుగుల తేడాతో ఓడించింది. రెండు జట్ల మధ్య మంగళవారం ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై... కెప్టెన్ రోహిత్ (52 బంతుల్లో 94; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఓపెనర్ ఎవిన్ లూయీస్ (42 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.
కోహ్లి (62 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ కనీస పరుగులు కూడా చేయలేకపోవడంతో బెంగళూరు ఛేదనలో తేలిపోయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడిపోయింది. ముంబై బౌలర్లలో కృనాల్ (3/28), బుమ్రా (2/28), మెక్లీనగన్ (2/24) క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కోలు కోనివ్వలేదు. రోహిత్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఆరంభం బాగోలేకున్నా...
0/2... ఇన్నింగ్స్ తొలి రెండు బంతులకు ముంబై పరిస్థితిది. ఈ సీజన్‌లో స్థిరంగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ (0), ఇషాన్ కిషన్ (0)లు ఉమేశ్ పేస్ ధాటికి ఖాతా తెరవకుండానే బౌల్డ్ అయ్యారు. ఇలాంటి దశ నుంచి పైకి లేచి భారీ స్కోరు సాధించిందంటే ఆ ఘనతంతా లూయీస్, రోహిత్‌దే. వికెట్లు కోల్పోయిన ప్రభావం నుంచి జట్టును వీరు త్వరగానే బయట పడేశారు.
ధాటిగా ఆడుతూ మూడో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి ముంబైను ఆదుకున్నారు. రోహిత్ జోరు చూస్తుంటే అతను సెంచరీ చేయడం ఖాయంగా కనిపించినా... అతనికి 18వ ఓవర్‌లో ఒక్క బంతే ఆడే అవకాశం వచ్చింది. అండర్సన్ వేసిన చివరి ఓవర్‌లో ఫోర్, సిక్స్, ఫోర్‌తో శతకానికి చేరువైనా మరో భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో వోక్స్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు.
ఆరంభం బాగున్నా...
డాషింగ్ బ్యాట్స్‌మన్ మెకల్లమ్‌ను పక్కన పెట్టడంతో బెంగళూరు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన డికాక్, కోహ్లి లక్ష్యానికి తగ్గట్లు 4 ఓవర్లలోనే 40 పరుగులు జోడించారు. కానీ, డికాక్, డివిలియర్స్ (1)లను మూడు బంతుల వ్యవధిలో అవుట్ చేసి మెక్లీనగన్ దెబ్బ కొట్టాడు. స్పిన్నర్ల కట్టుదిట్ట బంతులతో బౌండరీలే కష్టమై రన్‌రేట్ పడిపోయింది. కృనాల్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి మన్‌దీప్ సింగ్ (16) స్టంపౌటయ్యాడు.
హిట్టర్‌గా ఆశలు పెట్టుకున్న అండర్సన్ (0) మరుసటి బంతికే పేలవ షాట్‌కు యత్నించి నిష్క్రమించాడు. అవతలి ఎండ్‌లో కోహ్లి నిలదొక్కుకుని షాట్లు కొడుతున్నా సుందర్ (7), సర్ఫరాజ్ (5), వోక్స్ (11) ఇలా అందరూ నిరాశపర్చారు. దీంతో బెంగళూరు చేసేదేమీ లేకపోయింది. బెంగళూరు ఇన్నింగ్స్ 13వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన త్రో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కంటికి బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన అతడు మైదానం వీడాడు. దీంతో ఆదిత్య తారే బాధ్యతలు తీసుకున్నాడు.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సూర్యకుమార్ (బి) ఉమేశ్ 0; లూయిస్ (సి) డికాక్ (బి) అండర్సన్ 65; ఇషాన్ కిషన్ (బి) ఉమేశ్ 0; రోహిత్ శర్మ (సి) వోక్స్ (బి) అండర్సన్ 94; కృనాల్ పాండ్యా రనౌట్ 15; పొలార్డ్ (సి) డివిలియర్స్ (బి) వోక్స్ 5; హార్దిక్ పాండ్యా నాటౌట్ 17; మెక్లీనగన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 213.
వికెట్ల పతనం: 1–0, 2–0, 3–108, 4–148, 5–178, 6–207. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 4–0–36–2, వోక్స్ 3–0–31–1, వాషింగ్టన్ సుందర్ 2–0–32–0, సిరాజ్ 4–0–34–0, చహల్ 3–0–32–0, అండర్సన్ 4–0–47–2.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి నాటౌట్ 92; డికాక్ (బి) మెక్లీనగన్ 19; డివిలియర్స్ (సి) హార్దిక్ (బి) మెక్లీనగన్ 1; మన్‌దీప్ సింగ్ (స్టంప్డ్) ఇషాన్ కిషన్ (బి) కృనాల్ 16; అండర్సన్ (సి) సబ్–డుమిని (బి) కృనాల్ 0; సుందర్ (సి) ఉమేశ్ (బి) కృనాల్ 7; సర్ఫరాజ్ (స్టంప్డ్) సబ్–ఆదిత్య తారే (బి) మార్కండే 5; వోక్స్ (సి) కృనాల్ (బి) బుమ్రా 11; ఉమేశ్ (సి) రోహిత్ (బి) బుమ్రా 1; సిరాజ్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167.
వికెట్ల పతనం: 1–40, 2–42, 3–75, 4–75, 5–86, 6–103, 7–135, 8–137. బౌలింగ్: బుమ్రా 4–0–28–2, కృనాల్ 4–0–28–3, మెక్లీనగన్ 3–0–24–2, ముస్తఫిజుర్ 4–0–55–0, మార్కండే 4–0–25–1, హార్దిక్ 1–0–4–0.
ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్ vs కోల్‌కతా
వేదిక: జైపూర్, రా.గం. 8 నుంచి
స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment