కొడుకు మృతి , కూతురి పరిస్థితి విషమం
కేకే.నగర్: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి తన ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన ఆత్తూర్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో కుమారుడు చనిపోగా కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం ఆ వ్యక్తి తన పై కూడా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు.. సేలం జిల్లా ఆత్తూర్ సమీపంలోని అన్భురాజ్ (24) ఆత్తూరులోని సెలూన్ షాపులో పని చేస్తున్నాడు.
ఇతనికి భార్య రేవతి (20) ఆర్తె (05) అనే కుమార్తె, శివ (02) అనే కుమారుడు ఉన్నారు. అన్భురాజుకు మద్యం సేవించే అలవాటు ఉంది. ఆదివారం రాత్రి మద్యం మత్తులో తూగుతూ వచ్చిన అన్భురాజ్ భార్య రేవతితో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో రేవతిపై దాడి జరిపి వెలుపలకు నెట్టాడు. ఇంటి లోపలికి రావద్దు బైటనే పడుకోమని తలుపులకు గొళ్లెం పెట్టిన అన్భురాజ్ తన పిల్లలు ఆర్తి, శివలతో నిద్రించాడు.
అయితే అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన రేవతి వెంటనే లోపలికి వెళ్లి చూడగా అన్భురాజ్, పిల్లలు మంటల్లో కాలుతూ కనిపించారు. దీంతో రేవతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ముగ్గురిని ఆత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి ఉన్నత చికిత్స నిమిత్తం సేలం ప్రభుత్వాసుపత్రికి పంపారు. మార్గమధ్యలో శివ మృతి చెందాడు. ఆర్తి, అన్భురాజుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
మద్యం మత్తులో కన్నబిడ్డలకు నిప్పంటించిన తండ్రి
Published Tue, Jun 28 2016 4:20 AM | Last Updated on Thu, Apr 4 2019 4:46 PM
Advertisement
Advertisement