రాజధానిలో మరో 10 వేల ఆటోలు, 6 వేల బస్సులు..
దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యాన్ని నివారించేందుకు సరికొత్త పద్ధతులను అవలంభిస్తున్న ఆప్ సర్కార్.. ప్రజా రవాణా వ్యవస్థ(పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్)ను బలోపేతంచేసేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు నగర పరిధిలో కొత్తగా 10 వేల ఆటోలు, 6 వేల బస్సులకు అనుమతి మంజూరుచేసింది. దీంతో ఢిల్లీలో ఇప్పుడున్న ఆటోల సంఖ్య 80 వేల నుంచి 90 వేలకు చేరుకోనుంది.
ఈ ప్రజారవాణా వాహనాలు జనవరి 1 నుంచి అదుబాటులోకి వస్తాయని ఢిల్లీ రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. కొత్తగా రోడ్లెక్కనున్న వాహనాలన్నీ సీఎన్ జీతో నడిచేవేనని, తద్వారా సాధ్యమైనంతమేరలో కాలుష్యాన్ని తగ్గించినట్లువుతుందని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో జనవరి 1 నుంచి అమలు కానున్న సరి- బేసి విధానంపై సాధారణ ప్రజలు, వీఐపీలు సానుకూలంగా స్పందించడంతో, ఈ తరహా విధానాలు మరికొన్నింటిని అమలుచేయాలనుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు అన్ని ఆటోలు ఒకేసారి రోడ్లపై వచ్చేకంటే షిఫ్టుల వారీగా అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆమేరకు ఇప్పటికే అధికారులు ఆటో డ్రైవర్ల సంఘాలతో చర్చలు మొదలుపెట్టారు.
సరి బేసి విధానంలో వాహనాల రిజిస్ట్రేషన్ చివరి నంబర్ ను బట్టి, రోజు విడిచి రోజు సరి-బేసి సిరీస్ వాహనాలకు రోడ్డుపైకి రావడానికి అనుమతి ఇస్తారు. దీనివల్ల ఒకే ప్రాంతంలో నివసించే సరి-బేసి వాహనదారులు ఒకే కారులో ప్రయాణించేలా చేయాలన్నిది ఢిల్లీ సర్కార్ ఆలోచన. అయితే ఈ విధానంపై విమర్శలు లేకపోలేదు. ఇప్పటికే ఒక కారు ఉండి, మరో కారు కొనగలిగే స్థోమత ఉన్నవారు సరి, బేసి నంబర్ల కార్లు కొనుగోలుచేసే అవకాశం ఉంటుందని, దీనివల్ల కార్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుదని కొందరు వాదిస్తున్నారు.