బలమైన కూటమే లక్ష్యం
Published Tue, Dec 24 2013 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేను ఢీ కొట్టేందుకు రాష్ర్టంలో బలమైన కూటమి ఆవిర్భావమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు డీఎండీకే అధినేత విజయకాంత్ స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు వద్దంటున్నారని, దీనిపై పరిశీలన జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇన్నాళ్లు పొత్తులపై మౌనంగా ఉన్న విజయకాంత్ ఎట్టకేలకు పార్టీ క్రిస్మస్ వేడుకల్లో పెదవి విప్పారు.రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల చర్చ హాట్ టాపిక్‌గా మారింది. అన్ని పార్టీలు పొత్తులపై మంతనాల్లో నిమగ్నం అవుతున్నాయి. అరుుతే ప్రధాన ప్రతి పక్ష నేత, డీఎండీకే అధినేత విజయకాంత్ మాత్రం మౌనంగా ఉన్నారు. సోమవారం చెన్నైలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో బలమైన కూటమే లక్ష్యం అంటూ పొత్తులపై విజయకాంత్ పెదవి విప్పారు.
క్రిస్మస్ వేడుక: రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు డీఎండీకే నాయకులు ఆయా జిల్లాల్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించి, పేద క్రైస్తవులకు తమ వంతు సహకారం అందించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం కోయంబేడులో వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ కేక్‌ను విజయకాంత్‌తో పాటుగా పలువురు ఫాదర్లు కత్తిరించారు. పేదలకు సహాయకాలను విజయకాంత్ పంపిణీ చేశారు. అనంతరం విజయకాంత్ ప్రసంగించారు.
డీఎండీకే కథ ముగిసిందంటూ రాష్ట్రంలో పెద్ద ప్రచారమే జరుగుతోన్నదని గుర్తు చేశారు. చెట్టు ఆకులు ఏడాది కోసారి రాలిపోతాయని, ఆ తర్వాత కొత్తగా చిగురిస్తాయని గుర్తు చేశారు. అదే తరహాలో ఇప్పుడు డీఎండీకే సరికొత్తగా రూపుదిద్దుకుంటోందని, ఇక తమకు తిరుగు లేదని, ప్రకాశవంతంగా పార్టీ పయనించబోతోన్నదని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి మరో కెప్టెన్ అవసరం అని, ఇక్కడ ప్రసంగించిన వాళ్లందరూ పేర్కొన్నారని గుర్తు చేశారు. విమానానికి ఇద్దరు పెలైట్‌లు ఉన్నట్టుగా పార్టీకి అవసరం అంటున్నారు కాబట్టి, మరో కెప్టెన్‌ను తెర మీదకు తీసుకొస్తానన్నారు.
బలమైన కూటమి: రాష్ట్రంలో ముస్లిం, హిందు, క్రిస్టియన్లు తదితర అన్ని సామాజిక వర్గాల్ని సమానంగా చూస్తూ, అన్ని పండుగల్ని ఘనంగా జరుపుకుంటూ వస్తున్న ఒకే ఒక్క పార్టీ డీఎండీకే మాత్రమేనని విజయకాంత్ పేర్కొన్నారు. ఇక్కడ ప్రసంగించిన పెద్దలు బీజేపీతో పొత్తు వద్దే వద్దని పేర్కొన్నారని, దీనిపై తప్పకుండా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకేను ఢీ కొట్టడం, ఆపార్టీని రానున్న లోక్ సభ ఎన్నికల్లో పతనం అంచుకు తీసుకెళ్లడం లక్ష్యంగా ముందుకెళుతున్నట్టు వివరించారు. ఆ పార్టీని ఢీ కొట్టే బలమైన కూటమి లక్ష్యంగా ముందుకె ళుతున్నామని, గెలుపు తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement