భూమిలో కూరుకు పోయిన నంజనగూడు రథ చక్రం | Nanjanagudu into the chariot wheel of the ground lost | Sakshi
Sakshi News home page

భూమిలో కూరుకు పోయిన నంజనగూడు రథ చక్రం

Published Sat, Apr 12 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM

Nanjanagudu into the chariot wheel of the ground lost

  • భక్తుల్లో భయాందోళన   
  •  గంటకు పైగా శ్రమించిన సాంకేతిక నిపుణులు
  •  మైసూరు, న్యూస్‌లైన్ : దక్షిణ కాశీ క్షేత్రంగా భాసిల్లుతున్న నంజనగూడులో శుక్రవారం అపశ్రుతి చోటు చేసుకుంది. నంజుండేశ్వర పంచ మహా రథోత్సవం సందర్భంగా ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తున్న భారీ రథం చక్రం భూమిలో కూరుకుపోయింది. సంఘటనతో వేలాది మంది భక్తుల్లో భయాందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే... నంజుండేశ్వర బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం పంచ మహారథోత్సవాన్ని నిర్వహించారు.

    ఈ సందర్భంగా 90 అడుగుల ఎత్తై రథం, 120 టన్నులు బరువైన రథం(గౌతమ)పై ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేసేందుకు సన్నాహాలు చేశారు. ఉదయం 5.30 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 8.30కు రథోత్సవం మొదలైంది.  పాఠశాల వీధిలో రథం ముందుకు సాగుతుండగా 9.30 గంటలకు కుడివైపు ముందు చక్రం ఒక్కసారిగా భూమిలో కూరుకుపోయింది. రథం ఒక వైపు ఒరిగింది. సంఘటనతో భక్తులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు.

    వెంటనే ఆలయ అధికారులు, పోలీసులు, సిబ్బంది అప్రమత్తమై రథం చుట్టు పక్కల భక్తులు ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రథం చక్రాన్ని వెలికి తీసేందుకు రైల్వే సహకారాన్ని తీసుకున్నారు. రైల్వే శాఖకు చెందిన సాంకేతిక నిపుణులు పెద్ద పెద్ద జాకీలను రథం కింద అమర్చారు. అనంతరం నాలుగు జేసీబీలను ఉపయోగించి 1.30 గంటల పాటు శ్రమించి రథాన్ని యథాస్థితికి తీసుకొచ్చారు.

    రథానికి ఈ ఏడాది రూ. 20 లక్షల వ్యయంతో రెండు కొత్త చక్రాలను అమర్చారు. కాగా, రథోత్సవానికి ఒక రోజు ముందే రూ. 25 లక్షల వ్యయంతో రోడ్డును మరమ్మతు చేశారు. పనులు నాసిరకంగా ఉండడంతో పాటు గత రాత్రి వర్షం కురవడంతో ఈ అపశ్రుతి చోటు చేసుకున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. కాగా, రథోత్సవానికి కర్ణాటక నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తొలుత గణపతి రథం, తర్వాత శ్రీకంఠేశ్వర(గౌతమ), చండికేశ్వర, సుబ్రహ్మణ్య, చివరగా పార్వతమ్మ రథాలు ఒకదాని వెనుక ఒకటి వరుసగా భక్తులు లాగుతారు. గౌతమ రథంలో శ్రీకంఠేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని అధిష్ఠింపజేసి ప్రత్యేకంగా అలంకరించారు.

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement