ఈ సందర్భంగా రిటైర్డు అడిషనల్ జాయింట్ కలెక్టర్ షంషీర్ అహ్మద్ మాట్లాడుతూ నిర్మాణం చేసే ప్రాజెక్టు ప్రభుత్వానికి సంబంధించినది అయితే భూమి కోల్పోయేవారు 70 శాతం మంది, ప్రైవేట్ ప్రాజెక్టు అయితే 80 శాతం మంది ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. భూములు కోల్పోయిన వారికి పరిహారం, పునరావాసం విషయంలో మార్కెట్ రేటుకు నాలుగురెట్లు పెంచి ఇవ్వాలన్నారు. నిర్మాణం చేసే పరిశ్రమలో బాధిత కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్నారు. పనులు కోల్పోయిన వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు పింఛన్లు ఇవ్వాలని 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్నారన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రయోజనం పేరుతో సామాజిక అధ్యయనాన్ని 60 రోజుల నుంచి 15 రోజులకు కుదించేసిందన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండున్నరేళ్ల కాలంలో 40 దేశాలకుపైగా తిరిగారన్నారు. మేకిన్ ఇండియా పేరుతో కార్పొరేట్ శక్తులు దేశాన్ని దోచుకునేందుకు చట్టాలు సవరిస్తున్నారన్నారు. కార్మిక చట్టాలు, భూసేకరణ చట్టాలను ప్రజాప్రయోజనాల కోసం కాకుండా కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తున్నారన్నారు. దీన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘ జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.వెంకట్రావు, కంకణాల ఆంజనేయులు, రైతు కూలీ సంఘ జిల్లా కార్యదర్శి కే నాంచార్లు, గిరిజన సంఘ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాసులు పాల్గొన్నారు.