నాడిపట్టే దిక్కులేదు
నాడిపట్టే దిక్కులేదు
Published Fri, Oct 21 2016 3:39 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి దందా
పరీక్షల పేరిట బయటకు చీటీలు
కమీషన్లకు కక్కుర్తి పడుతున్న వైద్యులు!
రోగుల జేబులకు చిల్లు
చాలాచోట్ల సిబ్బందే వైద్యుల అవతారం
‘సాక్షి’ పరిశీలన వెలుగు చూసిన సర్కార్ వైద్యం తీరిది
ధర్మాసుపత్రుల్లో అవినీతి దందా సాగుతోంది. సేవలన్నీ ఉచితంగా అందిస్తామని పాలకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ రోగికి చీటీ రాస్తారు... చీటీలోని పరీక్షలన్నీ బయట ల్యాబ్‌లోనే చేయించుకోవాలి. వాళ్లేమో టెస్ట్‌కింత అని డాక్టర్లకు ముట్టజెబుతారు. చాలాచోట్ల వైద్యులు కన్పించలేదు. సిబ్బందే వైద్యం చేసి పంపుతున్నారు. విచిత్రమేమంటే సీఎం సొంత నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ పీహెచ్‌సీలోనే వైద్యులు సమయపాలన పాటించడం లేదు. సిద్దిపేట జిల్లా ధర్మాసుపత్రిలో పోస్టు్టమార్టానికి ఉపయోగించే దారంపోగుకు కూడా ఖరీదు కట్టారు. గురువారం ‘సాక్షి’ నెట్‌వర్క్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఏకకాలంలో సందర్శించినప్పుడు ఇలాంటి వ్యవహారాలెన్నో వెలుగు చూశాయి.
సాక్షి సిద్దిపేట: హుస్నాబాద్‌లోని 30 పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నా పెద్ద జబ్బులకు పట్టణాలకు వెళ్లాల్సిందే. ఆస్పత్రిలో నెలకు దాదాపు 15 నుంచి 20 వనకు నార్మల్ డెలివరీలు చేస్తున్నారు. ఆస్పత్రిలో స్త్రీల వైద్య నిపుణురాలు, అనస్తిషియా వైద్యుల పోస్టులు లేకపోవడంతో సీజేరియన్ ప్రసవాలు పట్టణాలకే పంపిస్తున్నారు. జ్వరం, దగ్గు వంటి జబ్బులకు మాత్రమే ఇక్కడే వైద్య సేవలందిస్తున్నారు. ఎక్సరే పరికరమున్నా రేడియాలజిస్టు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. రక్త, మూత్ర పరీక్షలు చేస్తున్నారు. మందులకు ఎలాంటి కొరత లేదు. కుక్క, పాముకాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోహెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 26 మంది రోగులు పీహెచ్‌సీకి వచ్చారు. వైద్యురాలు మెడికల్ లీవ్‌లో ఉండటంతో సిబ్బంది మందులు పంపిణీ చేశారు. ఇందులో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరంతో కూడిన రోగులు ఎక్కువగా వచ్చారు. ఆసుపత్రిలో మందుల కొరత లేదు. ఆస్పత్రిలో వైద్యులను నియమించాలని సముద్రాలకు చెందిన బక్కయ్య, నార్లపూర్‌కు చెందిన లక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు.
గజ్వేల్ ఆసుపత్రిలో ఇదో దందా....
ప్రభుత్వాసుపత్రిలో సాధారణ చికిత్సలకు సంబంధించి ఏడుగురు, హైరిస్క్ మానిటరింగ్ సెంటర్ (ప్రసూతి కేంద్రం)కు మరో నలుగురు వైద్యాధికారులున్నారు. ఆసుపత్రి ఓపీ సమయం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉండగా ‘సాక్షి’ ఉదయం 9నుంచి 11.30వరకు అక్కడే పరిశీలన జరిపింది. ఈ సమయంలో ఓపీలో సూపరింటెండెంట్ వెంకటేశ్వరప్రసాద్‌తోపాటు ముగ్గురు, ప్రసూతి కేంద్రంలో షిఫ్టింగ్ విధానంలో మరో ముగ్గురు వైద్యులు గర్భిణులను పరీక్షిస్తూ కనిపించారు. హైరిస్క్ కేంద్రానికి వచ్చే వారికి ఉచితంగా స్కానింగ్ చేయాలి. ఇందుకోసం పట్టణంలోని రెండు స్కానింగ్ కేంద్రాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవల ఇక్కడ ఉచిత స్కానింగ్ కేంద్రం ప్రారంభమైనా...అది నడవటం లేదు. ఆ రెండు కేంద్రాలకు కాకుండా మరో కేంద్రానికి స్కానింగ్ కోసం గర్భిణులను పంపిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన కొత్త బెడ్లను ఓ మూలన పడేశారు. రోగులు కిక్కిరిసే సందర్భంలో నేలపై పడుకోబెడుతున్నారు.
జగదేవ్‌పూర్‌లో కన్పించని సమయపాలన...
జగదేవ్‌పూర్ పీహెచ్‌సీలో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. గురువారం ఉదయం 10 గంటలకు కూడా పీహెచ్‌సీలో సిబ్బంది కన్పించలేదు. హెల్త్ అసిస్టెంట్, స్వీపర్ మాత్రమే విధులకు వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ వైద్యాధికారి, ఇద్దరు హెల్త్ అసిస్టెంట్లు, ఫార్మాసిస్టు, సీహెచ్‌ఓ, ఎల్‌టీ, ఆరోగ్యమిత్ర, స్వీçపర్, పదిమంది ఏఎన్ఎంలు విధులు నిర్వహిస్తున్నారు. ములుగు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పనిచేసే వైద్యాధికారి డాక్టర్ స్వప్న గురువారం సెలవులో ఉండటంతో స్టాఫ్‌నర్సు జ్యోతి మాత్రమే ఓపీ నిర్వహిస్తూ పేషెంట్లకు సేవలందించారు. ఉదయం 10.50 గంటల వరకు స్టాఫ్‌నర్సు మినహా మిగతా సిబ్బంది కన్పించలేదు. సూపర్‌వైజర్ హరిశంకర్ అప్పుడప్పుడే ఆసుపత్రికి చేరుకోగా సిబ్బంది విషయంలో ఆరాతీస్తే మాత్రం ఫార్మాసిస్టు మల్లేశం, యూడీసీ ఖలీద్‌అలీలు మర్కూక్, సింగన్నగూడ పీహెచ్‌సీల్లో డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 10.50 గంటల సమయంలో ఆసుపత్రిలోని ఓపీ రిజిష్టర్‌ను చూస్తే ఏడుగురికి మాత్రమే చికిత్స జరిపినట్లు కనిపించింది. డిప్యుటేషన్ల పీడతో వర్గల్ పీహెచ్‌సీ కునారిల్లుతున్నది. ఆరుగురు వైద్యులు ఉండాల్సిన ఆసుపత్రి సింగిల్ డాక్టర్‌కే పరిమితమైంది. ఒక డాక్టర్ లీవ్‌లో ఉండగా, మిగతా నలుగురు వేర్వేరు ప్రాంతాలకు డిప్యుటేషన్ పై వెళ్లారు.
దుబ్బాకలో మందు బిళ్లలు కరువు...
దుబ్బాక నియోజక వర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. నియోజక వర్గ కేంద్రమైన దుబ్బాక, తిమ్మాపూర్, రామక్కపేట, మిరుదొడ్డి, భూంపల్లి, తొగుట, దౌల్తాబాద్, ఇందుప్రియాల్, రాయపోల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఐరన్, క్యాల్షియం, పోలిక్ యాసిడ్ వంటి మందులు లేకపోవడంతో ఆసుపత్రికొచ్చే రోగులు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందులు కొంటూ కనిపించారు. దుబ్బాక పీహెచ్‌సీలో రోగులకు పరీక్షలు చేసే పరికరాలైన సక్షన్ మిషన్, డిజిటల్ ఎక్సరే, వెజినల్ ల్యాబ్ వంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేట్ డయోగ్నోసిస్ కేంద్రాల్లో పరీక్షలు చేసుకుంటున్నారు. మిరుదొడ్డితోపాటు భూంపల్లి పీహెచ్‌సీలున్నాయి. మిరుదొడ్డి పీహెచ్‌సీకి డాక్టర్ రాకపోవడంతో ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నిషియన్లే విధులు నిర్వహిస్తున్నారు. విధులను నిర్వహించే డాక్టర్ గదిలో ఖాళీ కుర్చీ దర్శనమిచ్చింది. మెడికల్ అధికారి సునీతను వివరణ కోరగా మండలంలోని ధర్మారం సబ్ సెంటర్ సందర్శనకు వెళ్లినట్టు తెలిపారు. తొగుట ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇన్సూలిన్, హెచ్‌ఐవీ టెస్టులు చేస్తున్నారు. 12 మంది టీబీ రోగులకు, నలుగురు లెప్రసీ రోగులకు నెలనెలా మందులు అందజేస్తున్నారు. రాయపోల్ మండలంలోని పీహెచ్‌సీలో వైద్యాధికారి లేకపోవడంతో 31 మందికి ఫార్మాసిస్టు శివకుమారి పరీక్షలు జరిపారు. టాయిలెట్లు ఉన్నా వాడుకలో లేవు.
సిద్దిపేట ధర్మాసుపత్రిలో అధర్మపాలన...
సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో మధ్యాహ్నం 2వరకు ఓపీ చూడాల్సి ఉండగా... మధ్యాహ్నం 12 గంటలకే కట్టేశారు. డ్యూటీడాక్టర్ వచ్చి రిజిస్టర్‌లో సంతకం పెట్టి వెళ్లిపోయాడట. ఆసుపత్రి మూత్రశాలల నుంచి వచ్చే దుర్గంధం ముక్కుపులాలను అదరగోడుతోంది. ఆసుపత్రికి వచ్చే మహిళలు అత్యవసరాలకు ఆ వాసనకు భరించలేక పోస్టుమార్టం వెనుక, ఆసుపత్రికి వెనుకకు వెళ్తున్నారు.
శవాన్ని పోస్ట్‌మార్టం చేయడానికి ఉపయోగించే దారం పోగుకు కూడా ఖరీదు కడుతున్నారు. బయటకు మాత్రం అంతా ఉచితమే.. కానీ మాది మాకు రావాలి అని సిబ్బంది బాధితుల నుంచి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా బయట ఉండే షాపుల దగ్గరనే బేర సారాలు సాగుతున్నాయి.
Advertisement