పార్లమెంట్‌లో మాట్లాడతా..!
Published Tue, Feb 4 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన యువకుడు నిడో తానియాపై జరిగిన దాడి ఘటనను పార్లమెంట్లు లేవనెత్తుతానని సిక్కిం పార్లమెంట్ సభ్యుడు పీడా రాయ్ పేర్కొన్నారు. సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం రాయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, దీనిపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయి చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. అందుకే తాను ఈ అంశాన్ని సభలో లేవనెత్తి చర్చకు డిమాండ్ చేస్తానన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యహారాల మంత్రి కమల్‌నాథ్, ఆర్థిక మంత్రి చిదంబరం, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎల్ కే అధ్వానీ, సుష్మా స్వరాజ్‌ల దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అధికార ప్రతినిధిస్థాయిలో, ఈశాన్య రాష్ట్రాల ఎంపీల ఫోరమ్ కార్యదర్శిగా ఆయన చేసిన ఈ ప్రకటనపై తామూ ఆలోచిస్తామని మిగతా పార్టీల నాయకులు తెలిపారు.
ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన...
నిడో తానియా హత్యకు కారకులైనవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ విధ్యార్థులు సోమవారం ఆర్ట్స్ ఫ్యాకల్టీ భవనం ఎదుట ఆందోళనకు దిగారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో సుమారు 200 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ర్యాలీ నిర్వహిస్తామని కోరగా ఢిల్లీ పోలీసులు అందుకు నిరాకరించారు.
దీంతో ఆర్ట్స్ ఫ్యాకల్టీ భవనం ఎదుటే ఆందోళనకు దిగారు. తమ డిమాండ్‌కు పోలీసుల నుంచిగానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచిగానీ ఎటువంటి స్పందన రాకపోతే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
Advertisement