త్వరలో ప్రభుత్వ కేబుల్ టీవీ
- రూ.100లకు వంద చానల్స్
- మంత్రి రోషన్‌బేగ్
సాక్షి, బెంగళూరు : త్వరలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కేబుల్ ప్రసారాలు చేయనున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్ స్పష్టం చేశారు. రూ. వందకే 100 ఛానళ్లను ప్రసారం చేయనున్నట్లు చెప్పారు. బెంగళూరులో ఆదివారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కేబుల్ యాక్ట్ ప్రకారం రూ.100లకు వంద ఛానల్స్‌ను ప్రసారం చేయాల్సి ఉందన్నారు. అయితే కేబుల్ ఆపరేటర్లు వినియోగదారుల నుంచి ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు.
మరో వైపు కొంతమంది కేబుల్ ఆపరేటర్లు ఇంటర్‌నెట్ కేబుల్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కేబుల్ ప్రసారాలు చేస్తున్నారన్నారు. దీంతో రాష్ట్ర ఖజానాకు లక్షలాది రూపాయల గండిపడితోందని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా కేబుల్ తీగలను కరెంటు, టెలిఫోన్ స్తంభాల గుండా తీసుకువెలుతుండటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమస్య పరిష్కారంలో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కేబుల్ ప్రసారాలను అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఇందుకు సమ్మతించారని తెలిపారు. తమిళనాడులో ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘కేబుల్‌టీవీ’ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. రాష్ట్రమంతటా దశలవారిగా కేబుల్ ప్రసారాలను తీసుకువస్తామని స్పష్టం చేశారు. బెంగళూరు శివారులోని హెసరఘట్ట వద్ద నిర్మించతలపెట్టిన అత్యాధునిక ఫిల్మ్‌సిటీ విషయంపై కోర్టులో కేసు నడుస్తోందన్నారు.
త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. బెంగళూరులోనే ప్రపంచస్థాయి ఫిల్మ్‌సిటీ ఏర్పాటు కావడం వల్ల షూటింగ్‌తో పాటు ఇక పై షూటింగ్ తదుపరి కార్యక్రమాల (పోస్ట్ ప్రొడక్షన్) కోసం చెన్నై, ముంబయ్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. దీని చిత్ర నిర్మాణ వ్యయం తగ్గుతుందని రోషన్‌బేగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.