తమిళనాట జల్లికట్టు తరహా మరో ఉద్యమం!
చెన్నై: తమిళనాడులోని కావేరీ డెల్టా ప్రాంతంలో ఉన్న ఓ మారుమూల పల్లె నెడువసల్. ఇంతకుముందు కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, వేరుశనగ పంటలతో ఆహ్లాదకరంగా ఉండే ఈ గ్రామం.. ఇప్పుడు హైడ్రోకార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిపోతోంది. విద్యార్థి సంఘాలు, రాజకీయపార్టీలు, సినీతారలు, పర్యావరణవేత్తలు, పలు స్వచ్ఛంద సంస్థలు వారి పోరాటానికి మద్దతు తెలుపుతున్నాయి. మెరీనా బీచ్లో జల్లికట్టు కోసం చూపిన ఉద్యమ స్ఫూర్తి.. మరోసారి నెడువసల్ లో కనిపిస్తోంది.
ఓఎన్జీసీ ఆధ్వర్యంలో ఇక్కడ హైడ్రోకార్బన్ ప్రాజెక్ట్ చేపట్టారు. పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని చెప్పి నెడువసల్తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భూములను లీజుకు తీసుకున్నారు. పరిశోధన కోసం తవ్విన హైడ్రోకార్బన్ బావుల వద్ద వెలువడుతున్న నల్లటి బురద లాంటి ఆయిల్ మెల్లగా ఆ ప్రాంతంలో వ్యాపిస్తోంది. దీంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. ఈ ప్రాజెక్ట్ మూలంగా దీర్ఘకాలంలో ఆరోగ్యం, జీవనోపాధి కోల్పోతామని వారిప్పుడు బలంగా నమ్ముతున్నారు. ఫిబ్రవరి 15న ప్రధానమంత్రి నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రాజెక్ట్ ఒప్పందాలను ఆమోదించింది. దీంతో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఉద్యమబాట పట్టారు.
నిరక్షరాస్యులైన తమ కుటుంబపెద్దల నుంచి గతంలో తమ భూములు లాక్కున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామి సైతం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. హైడ్రోకార్బన్ ప్రాజెక్టును ఆపాలని ఆయన ప్రధానిని కోరారు. ఆందోళనలు విరమించాలని పళని స్వామి నెడువసల్ వాసులను కోరారు . అయితే స్పష్టమైన హామీ కేంద్రం నుంచి వచ్చేంతవరకు తమ నిరసన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.