శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో భారీ నష్టాలను మూటగట్టుకున్న శాంసంగ్ నోట్ సిరీస్‌ను కొనసాగించనున్నట్టు అధికారికంగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో గెలాక్సీ 8నోట్‌ను లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2017 సంవత్సరం ద్వితీయార్థంలో ఈ స్మార్ట్‌ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు సమాచారం. ముఖ్యంగా శాంసంగ్ ఫలితాల సందర్భంగా
శాంసంగ్ చీఫ్ డీజే కో ఈ విషయాన్ని సూచన ప్రాయంగా ప్రకటించారు. శాంసంగ్ గురువారం మార్చి 31 తో ముగిసిన త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఈ సందర్బంగా తన కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నామని సంస్థ తెలిపింది. 2017 రెండవ భాగంలో దీన్ని విడుదల చేస్తామని పేర్కొంది.
కాగా గత ఏడాది ఆగస్టులో గెలాక్స్ నోట్ 7 లాంచ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్‌బ్యాటరీ పేలుడు ఘటనలు నమోదు కావడంతో మొత్తం డివైస్‌ను వెనక్కి తీసుకుంది. దీంతో ఈ సంక్షోభంతో నోట్ సిరీస్‌కు శాంసంగ్ ఇక స్వస్తి పలికినట్టేనని ఊహాగానాలు వచ్చాయి. అలాగే గెలాక్సీ నోట్ 8 ఏప్రిల్ 2017 లో రానుందని మొదట అంచనాలు చెలరేగాయి. మరోవైపు గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ వైఫల్యం కారణంగా వినియోగదారుల విశ్వసనీయతను కోల్పొ వటంతో ఈసారి బ్యాటరీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.