తెలంగాణలో అమెజాన్ పెట్టుబడులు
తెలంగాణ సర్కారుతో ఎంవోయూ..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత ఆన్‌లైన్ వస్తు విక్రయ సంస్థ ‘అమెజాన్’ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌కు సమీపంలోని కొత్తూరులో సుమారు 2.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో అతిపెద్ద సఫలీకృత కేంద్రం (ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్)ను త్వరలో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అమెజాన్ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. బుధవారం సచివాలయంలో ఐటీ మంత్రి కె.తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార ్యదర్శి రాజీవ్ శర్మ సమక్షంలో అమెజాన్ ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమెజాన్ సంస్థ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ డేవ్ క్లార్క్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న ప్రోత్సాహం వల్లే అమెజాన్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు.
రాజధానికి సమీపం(కొత్తూరు)లో నిర్మించే సఫలీకృత కేంద్రం ద్వారా వినియోగదారులకు వేగంగా సేవలందించడంతో పాటు వేలాది మంది చిరు, మధ్యతరగతి వ్యాపారులు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా విక్రయించేందుకు వీలు కల్పిస్తామన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు రవాణా సదుపాయం, భౌగోళికంగా అనువైన పరిస్థితులున్నందున అమెజాన్ వంటి సంస్థలకు ఎంతో ప్రయోజనం చేకూరనుందన్నారు. అమెజాన్ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం ద్వారా అమెజాన్ సంస్థకు 11 రోజుల్లోనే అనుమతులు ఇచ్చామన్నారు. అమెజాన్ సంస్థ ఇండియా మేనేజర్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. అమెజాన్ ద్వారా తాము అందిస్తున్న 2.10 కోట్ల విస్తృత శ్రేణి ఉత్పత్తులను తెలంగాణ పౌరులు వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నందుకుగానూ అమెజాన్ ప్రతినిధులకు సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.