ఆంధ్రోళ్లను ఎందుకు కించపరుస్తున్నారు?
- ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ప్రశ్న
- తెలంగాణకు కొందరు ద్రోహం చేస్తే అందరినీ నిందించాలా?
- ఇక్కడుండే ఇతర ప్రాంతాల వాళ్లంతా తెలంగాణ వారే
- వారందరినీ ప్రభుత్వం అక్కున చేర్చుకోవాలి
- బడ్జెట్ సమావేశాలు అర్థవంతంగా జరిగాయి.. అభినందనలు
సాక్షి, హైదరాబాద్: అవకాశం చిక్కినప్పుడల్లా ఆంధ్రావాళ్లు, రాయలసీమవాళ్లు అంటూ ఆరోపణలు చేయడం, కించపరిచేలా మాట్లాడటం సరికాదని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. వారిని తక్కువ చేసి మాట్లాడే విధానానికి తమ పార్టీ పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. గురువారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భాగంగా మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణకు ఎవరో కొందరు ఆయా ప్రాంత నేతలు నష్టం చేసి ఉండొచ్చని, అంతమాత్రాన ఆ ప్రాంత ప్రజలంతా చెడ్డవాళ్లన్నట్టుగా చిత్రీకరించటం సరికాదన్నారు. కొందరు ముస్లింలు చెడ్డవాళ్లయినంత మాత్రాన ముస్లింలందరినీ నిందించటాన్ని ఎలా వ్యతిరేకిస్తున్నామో ఆంధ్రా వాళ్ల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తామన్నారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఇలాంటి ఆరోపణలతోనే పరిస్థితి అదుపు తప్పిందని, ఇకనైనా ఆ పద్ధతికి అన్ని పార్టీలు స్వస్తి పలకాలన్నారు. తెలంగాణలో ఇతర రాష్ట్రాల వారు ఎలా ఉంటున్నారో, ఆంధ్రావాళ్లు కూడా అలాగే ఉంటారని, అందరినీ ప్రభుత్వం అక్కున చేర్చుకోవాలని హితవు పలికారు. ప్రాంతం ఏదైనా ఇక్కడుండేవాళ్లంతా తెలంగాణవాళ్లేనన్న అభిప్రాయంతో ఉండాలని హితవు పలికారు.
అలాంటి ఘటనేదీ జరగలేదు: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే ఈ ప్రాంతంలో ఆంధ్రావారికి వేధింపులు తప్పవంటూ ఉద్యమ సమయంలో కొందరు కావాలని దుష్ర్పచారం చేశారని, కానీ తాము అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో అలాంటి ఒక్క ఘటన కూడా చోటుచేసుకోలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. అక్బర్ వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. హైదరాబాద్ తెలంగాణలో భాగమని, తెలంగాణ దేశంలో అంతర్భాగమనే పద్ధతితో తాము ముందుకెళ్తున్నామన్నారు.
ఇలాంటి సభ 1995 తర్వాత ఇప్పుడే చూశా..
బడ్జెట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చతో 40 పద్దులను ఆమోదించుకోవటం అభినందనీయమని, 1995 తర్వాత ఈ తరహా సభానిర్వహణను చూడలేదని అక్బరుద్దీన్ అభినందించారు. కాగ్ నివేదికను సభ చివరిరోజు కాకుండా కనీసం రెండు రోజుల ముందు ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. నిజాం హయాంలో మొదలైన జవరహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ వర్సిటీని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూల్‌లో చేర్చారని, ఏపీకి ఏమాత్రం సంబంధం లేని వర్సిటీని ఆ జాబితాలో చేర్చినా తెలంగాణ ప్రభుత్వం మిన్నకుండటం ఏమిటని ప్రశ్నించారు. వర్సిటీలపై గవర్నర్ పెత్తనం సరికాదని, వెంటనే రాష్ట్రప్రభుత్వానికి సర్వ అధికారాలు సంక్రమించేలా బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో 1.50 ల క్షల మంది ఆంధ్రాఉద్యోగులున్నారని, ఆ పోస్టులు తెలంగాణకు దక్కే విషయంలో ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. హజ్ యాత్రికుల కోసం మక్కాలో నిజాం నిర్మించిన విశ్రాంతి మందిరాలు (రుబాత్)లు తెలంగాణ యాత్రికులకు ఉపయోగపడటం లేదని, ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామన్న హామీకి దిక్కులేకుండా పోయిందన్నారు. ఆ విమర్శ సరికాదని, పనులు జరుగుతున్నాయని మంత్రి పద్మారావు సమాధానమిచ్చారు.