హైదరాబాద్‌సిటీ : లాటరీ పేరుతో ప్రజలకు శఠగోపం పెట్టేందుకు ఇద్దరు నైజీరియన్లు వేసిన స్కెచ్‌ను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు పసిగట్టి వారి గుట్టును రట్టు చేశారు. ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేసి వారి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్ ఏసీపీ జయరాం కథనం ప్రకారం... నైజీరియాకు చెందిన క్రిస్టోఫర్ (31), ఓజియోబీ అమీన్ విక్టర్ (34)లు అక్రమంగా మూడేళ్ల నుంచి నగరంలో ఉంటున్నారు. వీరిద్దరు లాటరీల పేరుతో ప్రజలకు కుచ్చుటోపి పెట్టేందుకు కుట్రలకు పాల్పడ్డారు.
ఈ క్రమంలోనే మణికొండ ప్రాంతంలో ఒక ఫ్లాట్‌ను నెల రోజుల క్రితం అద్దెకు తీసుకుని రెండు ల్యాప్‌టాప్‌ల ద్వారా లక్ష ఈమెయిల్ ఐడీలను సంపాదించారు. వారందరికి మెక్రోసాఫ్ట్ ఔట్‌లూక్, కొకకోలా బీబీసీ, రెడ్‌బ్లూలో లాటరీ గెలిచారని ఈ మెయిల్స్ చేశారు. లాటరీ మొత్తం డబ్బులు కావాలంటే ట్యాక్స్, ఆర్‌బీఐ అనుమతి కింద కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, ఈ డబ్బులు తాము పేర్కొన్న అకౌంట్‌లో వేయాలని ఈ మెయిల్స్ పంపించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్, ఎస్‌ఐలు విజయవర్ధన్, మైపాల్‌రెడ్డిలు దర్యాప్తు చేపట్టారు. ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీయగా నైజీరియన్లు అద్దెకు ఉంటున్న ఫ్లాట్‌ను గుర్తించి దాడి చేశారు. వారి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు సెల్‌ఫోన్‌లు, పలు సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకుని వారిద్దరిని రిమాండ్‌కు తరలించారు.