దళితుల అభివృద్ధికి కృషి చేస్తా: దత్తాత్రేయ
హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు దళితులకు అందేందుకు మరింత కృషి చేస్తానని, వారి అభివృద్ధికి తోడ్పడతానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం లోయర్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ భవన్‌లో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాల సమన్వయంతో దళితులకు భూ పంపిణీ అయ్యేలా కృషి చేస్తామన్నారు. తన పరిధిలో ఉన్న 12 వేల ఐటీఐలను అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువత ఐటీఐలలో ప్రవేశపెట్టిన నూతన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం త్వరలో స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతున్నామన్నారు. వీటితో ఆరోగ్య, ఆమ్ ఆద్మీ బీమాతో పాటు పింఛన్ కూడా అందుతుందని వెల్లడించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర మంత్రి జోగు రామన్న, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రసంగించారు.షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ కన్వీనర్ సుదర్శన్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సమితి జాతీయ అధ్యక్షుడు మేకల ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికలో సమితి తెలంగాణ అధ్యక్షునిగా సుదర్శన్ బాబు, ప్రధాన కార్యదర్శిగా దాసరి రవీందర్, కోశాధికారిగా ఇ.సత్తయ్య తదితరులను ప్రతినిధులు ఎన్నుకున్నారు.