జలయజ్ఞం ఆయకట్టు పది లక్షలు
సాక్షి, హైదరాబాద్: జలయజ్ఞం ఫలితాలిస్తోంది. కొత్త ఆయకట్టు వృద్ధిలోకి వస్తోంది. జలయజ్ఞంలో భాగంగా పదేళ్ల కింద చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 2013-14 ఏడాది నాటికే 6 లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఇప్పటి వరకు 4.75 లక్షల నూతన ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఇందులో సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే సాగులోకి వచ్చినట్లు నీటి పారుదల శాఖ తాజా నివేదికలు చెబుతున్నాయి.
ఫలిస్తున్న జలయజ్ఞం..
2004-05లో జలయజ్ఞం కింద ఆప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.1.37 లక్షల కోట్లతో 34 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే మూడు ప్రాజెక్టులు పూర్తికాగా, మరో 14 ప్రాజెక్టుల కింద పాక్షికంగా ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టుల నుంచి 2013-14 నాటికి 6,14,897 ఎకరాలు కొత్తగా సాగులోకి రాగా, మరో 92,584 ఎకరాల స్థిరీకరణ జరిగింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పాత ప్రాజెక్టులతోపాటు కొత్త ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూ వస్తోంది.
ప్రాజెక్టు కోసం 2014-15లో రూ.5,285.03 కోట్లు, 2015-16లో రూ.7189.21 కోట్లును వెచ్చించగా, ఈ ఏడాది రూ.25 వేల కోట్లు కేటాయించింది. 2014-15 ఏడాది జూన్-జులై నాటికి లక్ష్యంగా నిర్ణయించుకున్న 6 లక్షల ఎకరాల్లో 66,399 ఎకరాలకు మాత్రమే నీరందించగలిగింది. తర్వాతి కాలంలో కొన్ని ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ, సహాయ పునరావాస పనులు కొలిక్కి రావడంతో కొత్త ఆయకట్టును వృద్ధిలోకి తీసుకువచ్చింది.
ఏడు లక్షల ఎకరాలు లక్ష్యం
ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలోని 8 ప్రాజెక్టులు సంపూర్ణంగా, 11 ప్రాజెక్టుల పాక్షికంగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ ప్రణాళిక వేసింది. వీటి ద్వారా మొత్తంగా 7,32,264 ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో ఎల్లంపల్లి కింద 60 వేలు, ఎస్సారెస్పీ-2 కింద 20 వేలు, నెట్టెంపాడు కింద 1.47 లక్షలు, భీమా కింద 1.25 లక్షల ఎకరాలకు నీరివ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు కింద నిర్ణీత ఆయకట్టుకు నీరందించడంతో సఫలీకృతమైంది.
ప్రస్తుత నీటి పారుదల శాఖ లెక్కల ప్రకారం కల్వకుర్తి కింద 1.47 లక్షలు, భీమా కింద 1.28 ల క్షలు, నెట్టెంపాడు కింద 1.20 లక్షలు, కోయిల్‌సాగర్ కింద 8 వేల ఎకరాల మేర కొత్త ఆయకట్టుకు ప్రభుత్వం నీరందిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం సాగులోకి వచ్చిన ఆయకట్టు 4,75,856 ఎకరాలకు చేరింది. మొత్తంగా 2013-14 వరకు సాగులోకి వచ్చిన ఆయకట్టుతో కలిపి జలయజ్ఞం కింద ఇంతవరకు 10,90,753 ఎకరాల మేర ఆయకట్టు సాగులోకి వచ్చినట్లయింది.