నేనున్నాను... | MPs poised to adopt a village in Nalgonda | Sakshi
Sakshi News home page

నేనున్నాను...

Published Sun, Nov 16 2014 12:58 AM | Last Updated on Fri, Jul 26 2019 5:59 PM

నేనున్నాను... - Sakshi

నేనున్నాను...

దత్తత గ్రామానికి నల్లగొండ ఎంపీ భరోసా
 
దేవరకొండ మండలం చింతకుంట్ల గ్రామపంచాయతీ...రెండు తండాలు, మరో గ్రామం కలిసి బతుకుతున్న శ్రమజీవుల
 ఆవాసం... అక్కడ అడుగడుగునా సమస్యలే... మరుగుదొడ్ల నుంచి మంచినీటి వరకు... పొలం కరెంటు నుంచి వీధి దీపాల
 వరకు.. ఉన్న సమస్యలకు తోడు... నాటుసారా దురలవాటుకు బలవుతున్న పేదలు... కరుణించని ప్రకృతి కారణంగా కష్టాల్లో
 అన్నదాతలు... ఇన్ని బాధల్లోఉన్న ఈ గ్రామస్తులకు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆపద్బాంధవుడిగా మారారు.  అక్కడి
 ప్రజల సమస్యలకు చలించిన ఆయన తనకు దేవరకొండ మండలంపై ఉన్న ప్రత్యేక ప్రేమతో చింత కుంట్లను సంసద్ ఆదర్శ
 యోజన కింద ఎంచుకున్నారు. ఆ గ్రామంలో ఏమేం ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం
 చే శారు... అయితే, ప్రజాప్రతినిధిగా కాకుండా జర్నలిస్టుగా మారి వారి సమస్యలను అడిగి  తెలుసుకున్నారు. చింతకుంట్లలో  

గుత్తా సుఖేందర్‌రెడ్డి    వీఐపీ రిపోర్టర్..
 
గుత్తా  : చెప్పు పెద్దమ్మా ! మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి
 
కేతావత్ బాలి : చాలా సమస్యలు ఉన్నాయి సార్. మంచినీటి ట్యాంకు లేదు. నీళ్లు రాక 20 రూపాయలకు ఒక క్యాన్ కొనుక్కుంటున్నాం. ఒక్కో రోజుకు రెండు క్యాన్లు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. నీళ్లు ఒక రోజు వస్తే మరో రోజు రావు. ఆర్టీసీ బస్సు తండాకు రావట్లేదు. ఆటోలు అప్పుడప్పుడు వస్తున్నాయి.

గుత్తా : వీధి లైట్లు వెలుగుతున్నాయా ?
 
కేతావత్ బాలి :  ఊళ్లో అప్పుడప్పుడు వెలుగుతూనే ఉన్నాయి. తండాలో రావట్లేదు.
 
గుత్తా : చెప్పమ్మా... నీ సమస్యలేంటి ?

బాలి : అన్నీ బాధలే ఉన్నాయి సార్. పింఛను రావట్లేదు.

గుత్తా : పెన్షన్ కాక ఇంకేం సమస్యలున్నాయి ?
 
బాలి : రోడ్లు సరిగ్గా లేవు. కరెంటు సరిగ్గా వస్తలేదు. ఇంకా చాలా సమస్యలున్నాయి.
 
గుత్తా : గ్రామంలో ఇంకా ఏం సమస్యలున్నాయి?
 
వజ్రమ్మ (వర్ధమానిగూడెం) : సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. కరెంటు సమస్య, రోడ్ల సమస్య అన్నీ ఉన్నయ్. మీరు దత్తత తీసుకున్నరని తెల్సిన తర్వాత మా పానాలకు కొంత జీవం వచ్చింది సార్. ( వీఐపీ రిపోర్టర్ గుత్తా నవ్వుతూ.... నేనున్నానమ్మా!)
 
గుత్తా : మీ తండాలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి ?
 
వజ్రమ్మ : యాభై ఇండ్లు ఉన్నయ్... 300 జనాభా ఉంది.
 
గుత్తా : మొదట మీకేం కావాలి ?
 
వజ్రమ్మ
: పసులకే కాదు సార్... మాక్కూడా నీళ్లు లేవు. మమ్మల్ని ఎవరూ గుర్తించడం లేదు. కెనాల్‌రావడం లేదు. బడిలో ఒక టీచర్ ఉన్నా, ఒక్క రోజు సెలవు పెడితే బడి డుమ్మానే. ఇంకో టీచర్ కావాలి.
 
గుత్తా : రెండు నెలలకోసారి అధికారులతో మీ ఊరొస్తా. మీ సమస్యలన్నీ దగ్గరుండి చూసుకుంటా. మీ సమస్యలు తీరడానికి నేనేం చేయాలి ? సమస్యలేంటి ?
 
బిచ్యానాయక్, కొర్రోనితండా : ఎత్తు ప్రాంతంలో ఇండ్లుండడం వల్ల వర్షం పడితే నీళ్లన్నీ ఇండ్లలోకి వస్తున్నాయి. ఇది వరకు ఎమ్మెల్యేకు కూడా చెప్పాం.
 
గుత్తా : పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి సహకరిస్తారా ? ముందుకొస్తారా ?
 
ముత్యాలు : సంతోషంగా చేస్తం సార్. ఊరు బాగుపడుద్దంటే కల్సి పని చేయమా.
 
గుత్తా : నాటుసారా బంద్ చేయించడానికి కలిసి వస్తారా ?
 
ముత్యాలు
: తప్పకుండా సార్. మీరు, అధికారులు సహకరించాలి.
 
గుత్తా
: వీధి దీపాలు వెలుగుతున్నాయా ?
 
ఆడెపు లింగయ్య : వస్తున్నాయ్ సార్. కాని మురికినీటి సమస్య, డ్రెయినేజీ సమస్య ఎక్కువగా ఉంది.
 
గుత్తా : ఏం చదువుతున్నావ్ ?  (ఓ విద్యార్థితో)

విద్యార్థి : డిగ్రీ చదువుతున్నాను సార్. నా పేరు వెంకటేష్.

గుత్తా : రోజూ కాలేజికి వెళ్తున్నావా ?

వెంకటేష్ : వెళ్తున్నాను సార్.
 
గుత్తా : 108, 104 మీ ఊళ్లకు వస్తున్నాయా ?
 
ఎల్లయ్య : ఆ... వస్తున్నయ్ సార్. కానీ మునుపటిలా రావట్లేదు. ఆలస్యంగా వస్తున్నయ్.  పెన్షన్స్ రావడం లేదు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వేయాల్సిన రోడ్లు బీసీ కాలనీలో వేశారు. మమ్మల్ని పట్టించుకోవట్లేదు.
 
గుత్తా : ఇంకా ఏం సమస్యలున్నాయి.

నాగరాజు : బస్సులు సరైన సమయానికి రావడం లేదు. ఆటోలకు వెళ్లాలంటే కష్టంగా ఉంది. రోడ్డు కూడా సరిగ్గా లేవు.
 
గుత్తా
: తల్లీ... నీ సమస్య చెప్పమ్మా ?

పన్నాల కమలమ్మ : ఎకరం పొలం చేస్తే అర ఎకరానికి నీళ్లు పారుతున్నాయ్ సార్. కరెంటు ఎప్పుడు వస్తుందో...ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. ఒక మడి పారితే ఇంకో మడి ఇంకో రోజుకు పారుతుంది. పెట్టుబడేమో వేలల్లో పెడితిమి. చెరువులకు నీళ్లు వస్తలేవు. అప్పులేమో ఎక్కువైనయ్. ఎట్ల కట్టాలో తెలుస్తలేదు. పోరగాళ్లు కూడా సారా తాగి పాడై పోతుర్రు. (ఆదర్శ గ్రామంగా చింతకుంట్ల ఎంపికైందిగా. ఇక సమస్యలన్నీ తీరుతయ్ లేమ్మా)
 
ఎంపీ ఏం హామీలు ఇచ్చాడంటే..

‘గ్రామాభివృద్ధికి అన్ని రకాలు చర్యలు తీసుకుంటాం. ముందుగా సమస్యలపై సర్వే చేస్తాం. సాగునీటి సమస్య తీరడానికి పెండ్లిపాకల ప్రాజెక్టు ఆధునికీకరణకు నిధులు మంజూరయ్యాయి. తద్వారా సాగునీరు వస్తుంది. తాగునీటి సమస్య పరిష్కారానికి కూడా కృషి చేస్తాం. ఇప్పుడు సమస్యలన్నీ క్లియర్‌గా తెలిశాయి. పశువుల ఆస్పత్రి, రోడ్లు, నీటి సమస్య, సారా వల్ల ఇబ్బందులు అన్నీ దృష్టికి వచ్చాయి. ఆదర్శ గ్రామంలో సంపూర్ణంగా సమస్యలన్నింటి పరిష్కారానికి కృషి చేస్తాం. చైర్మన్‌గా నేను, నోడల్ అధికారిగా కలెక్టర్‌తో గ్రామానికి వచ్చి ముందుగా అవసరాలను గుర్తిస్తాం. ప్రజలు, వివిధ శాఖల భాగస్వామ్యంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం. అదే నా ప్రధాన లక్ష్యం’.
 
ఘనస్వాగతం...

చింతకుంట్ల గ్రామశివారులో వేచి ఉన్నారు గ్రామస్తులంతా.. స్థానిక మండల పరిషత్ ఉపాధ్యక్షుడు డాక్టర్ వేణుధర్‌రెడ్డి, సర్పంచ్ శవ్వ వెంకటమ్మ నేతృత్వంలో అన్ని పార్టీల నాయకులు, ప్రజలు కలిసి తొలిసారి తమ గ్రామానికి వస్తున్న ఎంపీకి ఘనస్వాగతం పలికారు. జెడ్పీటీసీ సభ్యుడు ఆలంపెల్లి నర్సింహ, ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు  తిప్పర్తి ఎంపీపీ పాశం రాంరెడ్డిలతో కలిసి ఆయన గ్రామంలోనికి ప్రవేశించారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన చిన్న కార్యక్రమంలో పాల్గొని ఆయన ‘సాక్షి’ రిపోర్టర్‌గా మారిపోయారు. గ్రామంలోని ప్రధాన వీధులన్నీ కలియదిరిగి స్థానిక పరిస్థితులను పరిశీలించారు... అక్కడి నుంచి మెయిన్‌సెంటర్‌లో గుమికూడిన ప్రజల్లోకి వెళ్లి విలేకరిగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement