ఉట్నూర్ : గిరిజనుల పట్టా భూముల్లో మిషన్ కాకతీయ పనులు చేపడుతున్నా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందోర్ ప్రభాకర్ విమర్శించారు. సోమవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు అవసరం లేనిచోట అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సమర్పించి నిధులు మంజూరయ్యేలా చేశారని ఆరోపించారు. కెరమెరి మండలం చింతకర్ర గ్రామంలో శ్యాంరావ్‌కు చెందిన మూడెకరాల పట్టా భూమిలో కాంట్రాక్టర్ పుడిక తీత పనులు నిర్వహిస్తున్నాడని తెలిపారు.
సదరు రైతు భూమి తనదేనని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని తెలిపారు. సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, ఆ భూమి రైతుకు చెందేలా చూడాలని ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. జైనూర్, సిర్పూర్(యు) మండలాల్లో గిరిజనులకు చెందిన పట్టా భూములను అధికారులు చెరువు భూములుగా చూపడంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందన్నారు. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు ఓమేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
‘పట్టా భూముల్లో మిషన్ కాకతీయ పనులు’
Published Tue, May 26 2015 4:32 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement