మాఫీ రూ. 3,321 కోట్లు! | Rs. 3.321 crores! | Sakshi
Sakshi News home page

మాఫీ రూ. 3,321 కోట్లు!

Published Thu, May 29 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

మాఫీ రూ. 3,321  కోట్లు!

మాఫీ రూ. 3,321 కోట్లు!

సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో నాలుగున్నర లక్షల మందికిపైగా రైతులు  రుణ మాఫీ హామీ అమలు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో పంట రుణాలను మాఫీ చేస్తానని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నికల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తొలి సర్కార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2న కేసీఆర్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.
 
 ఈ క్రమంలో రుణ మాఫీపై రైతుల్లో ఆశలు చిగురించాయి. కొత్త ప్రభుత్వం ఎలాంటి షరతులులేకుండా ఈ హామీని అమలు చేస్తే జిల్లాలో 4 లక్షల 58 వేల 637 మంది రైతులకు సంబంధించిన రూ.3321.95 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ కానున్నాయి. రుణ మొత్తం, కాల పరిమితులపై షరతులు విధిస్తే మాత్రం ఆ నిబంధనల లోబడి మాత్రమే మాఫీ వర్తించనుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం ఇప్పటికే రుణ మాఫీపై కసరత్తును ప్రారంభించింది. రుణ మాఫీ అమలుపై కొత్త సర్కార్ చేతిలో ఉన్న కొన్ని ప్రధాన ఐచ్ఛికాలను పరిశీలిస్తే..
 
 తొలి ఐచ్ఛికం: ప్రభుత్వం షరతుల్లేకుండా అన్నీ రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తే జిల్లాలో 4,58,637 మంది రైతులకు సంబంధించిన మొత్తం రూ.3321.95 కోట్ల రుణాలు రద్దు కానున్నాయి.
 
 రెండో ఐచ్ఛికం:  గతేడాది ఖరీఫ్ నుంచి తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం కాలపరిమితితో కూడిన షరతు విధిస్తే.. జిల్లాలో 2,67,046 మంది రైతులకు సంబంధించిన రూ.1773.48 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉంటుంది. గతేడాది ఖరీఫ్(2013 ఎప్రిల్ 1) నుంచి 2014 రబీ(2014 మార్చి 31)మధ్య కాలంలో జారీ చేసిన రుణాలు మాత్రమే రద్దవుతాయి. వీటిలో పంట రుణాలు, బంగారంపై తీసుకున్న రుణాలతో పాటు ఇతర రుణాలున్నాయి.
 
 మూడో ఐచ్ఛికం: రుణ స్వీకరణపై కాల పరిమితి లేకుండా రూ.లక్ష లోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయిస్తే .. జిల్లాలో 2,76,678 మంది రైతులకు సంబంధించిన రూ.1762.09 కోట్ల రుణాలు మాఫీ కావచ్చు.
 
 నాలుగో ఐచ్ఛికం: గతేడాది ఖరీఫ్(2013 ఎప్రిల్ 1) నుంచి 2014 రబీ(2014 మార్చి 31)మధ్య కాలంలో జారీ చేసిన రూ.లక్ష లోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయిస్తే  జిల్లాలో 1,09,878 మంది రైతులకు సంబంధించిన రూ.738.62 కోట్ల రుణాలు మాఫీ కావచ్చు.
 
 రెండేళ్లుగా నిలిచిన చెల్లింపులు  
 పంట రుణాలను ఏడాదిలోగా తిరిగి బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది వ్యవధి దాటితే ఆ రుణాలను బ్యాంకర్లు మొండి బకాయి(ఓవర్ డ్యూ)ల కింద జమ చేస్తారు. ఆ తర్వాత 3 నెలలు గడిచినా ఈ మొండి బకాయిలను చెల్లించకపోతే ఈ రుణాలను నిరర్ధక ఆస్తులుగా పరిగణిస్తారు.  రాష్ట్రంలో రుణ మాఫీ హామీ చక్కర్లు కొడుతుండటంతో రెండేళ్లుగా రైతులు బకాయిలను చెల్లించడం నిలిపివేశారు. జిల్లాలో 1,32,813 మంది రైతులు బకాయిలు చెల్లించడం పూర్తిగా మానేయడంతో గత మార్చి 31 తేదీ నాటికి మొండి బకాయిలు రూ.906.3 కోట్లకు ఎగబాకాయి. ఇదే సమయంలో మరో 39,635 మంది రైతులు దీర్ఘకాలికంగా బకాయిలు చెల్లించకపోవడంతో రూ.180.83 కోట్ల రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement