![Strange Baby Born In Government Hospital In Sangareddy - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/3/baby_sangareddy.jpg.webp?itok=CFgOIKhv)
సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. కాళ్లు లేకుండా చేప తోక ఆకారంలో మత్స్యకన్యను పోలినట్టుగా ఆ శిశువు ఉంది. మెదక్ జిల్లా పెద్దశకరంపేటకు చెందిన ఓ మహిళకు గురువారం పురిటి నొప్పులు రావడంతో ఉదయం 11 గంటలకు సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆమె వింత శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు ఒకటే కాలు ఉంది.
కాళ్ల భాగంలో చేప తోకలా ఉండి ఆడో, మగో తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉంది. ఈ విషయమై ఆస్పత్రి పిల్లల డాక్టర్ అశోక్ ముత్కని నుంచి వివరాలు కోరగా ఆ శిశువుకు జననాంగం లేదని తెలిపారు. జన్మించిన కొద్ది సేపటికే ఆ శిశువును హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తీసుకు వెళ్లాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. ఈ తరహా వింత శిశువు జన్మించడం ఇదేం కొత్త కాదని, జన్యుపరమైన లోపాలతో ఇలా జన్మిస్తారని, లక్షల్లో ఒకరు మాత్రమే ఇలా పుడతారని చెప్పారు. అయితే ఇలా పుట్టిన వారు బతకడం చాలా కష్టమని ఆయన తెలిపారు. కాగా, వైద్యులు నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేసినప్పటికీ నవజాత శిశువును కుటుంబ సభ్యులు సంగారెడ్డి ఆస్పత్రిలోనే ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment