సాక్షి, హైదరాబాద్ : భారీ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వాలు భూ నిర్వాసితుల పునరావాస(2013) చట్టాలను ఉల్లంఘిస్తుండటం.. ఈ అంశంపై తెలుగు రాష్ట్రాలు తమవైన చట్టాలు రూపొందించుకోవడంపై ప్రఖ్యాత పర్యావరణ ఉద్యమ కారుడు, సుప్రీంకోర్టు న్యాయవాది మహేశ్ చంద్ర మెహతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించకపోతే ప్రభుత్వాలు ఇష్టారీతిలో వ్యవహరించడం మానుకోవని... పౌరులంతా సంఘటితంగా ఒక్కతాటిపై నిలిస్తే పాలకుల మెడలు వంచడం కష్టమేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన ‘మీట్ ద ప్రెస్’లో ఆయన మాట్లాడారు. పౌరులందరికీ స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన నీరు, ఆహారం అందివ్వడం అసలైన వికాసం అవుతుందిగానీ.. ‘‘వికాస్’’ అంటూ నినాదాలు ఇవ్వడంతో రాదని అన్నారు. నిజానికి ఇప్పుడు ప్రభుత్వాలు అనుసరిస్తున్నది వికాస్ మోడల్ కాదని.. వినాశ్ మోడల్ అని దుయ్యబట్టారు.
మేనిఫెస్టోల్లో చేర్చినా లాభం లేదు...
రాజకీయ పార్టీలు పర్యావరణ పరిరక్షణ అంశాలను తమ మేనిఫెస్టోల్లో చేర్చినా పెద్దగా ఫలితం ఉండబోదని.. ఎందుకంటే గెలుపు కోసం ఎన్ని అడ్డదారులనైనా తొక్కేందుకు అవి సిద్ధంగా ఉన్నాయని ఎంసీ మెహతా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో సాక్షి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్.దిలీప్ రెడ్డి, ప్రెస్‌క్లబ్ చైర్మన్ రాజమౌళి చారి, కార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్ రెడ్డి, ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురోషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment