త్రిశంఖు స్వర్గంలో తహశీల్దార్లు
- జిల్లాకు తిరిగొచ్చిన 32 మంది..
- వారం గడిచినా దక్కని పోస్టింగ్‌లు
- రాజకీయ జోక్యంపై సర్వత్రా ఆసక్తి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తహశీల్దార్ల పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ జోక్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లి.. తిరిగి జిల్లాకు వచ్చిన తహశీల్దార్లకు వారం రోజులు గడుస్తున్నా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం చర్చకు దారితీస్తోంది. ఈ పోస్టింగ్‌లలో జిల్లా మంత్రి జోగు రామన్నతోపాటు, ఎమ్మెల్యేల ప్రమేయం తప్పకుండా ఉంటుందనే అభిప్రాయం ఎన్నికల సందర్భంగా జిల్లాలో వివిధ చోట్ల పనిచేస్తున్న 54 మంది తహశీల్దార్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు బదిలీ అయ్యారు.
ఎన్నికలు ముగిసిన వెం టనే జిల్లా నుంచి వెళ్లిన ఈ తహశీల్దార్లలో 40 మంది తిరిగి జిల్లాకు వచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఈనెల 12నుంచి 16వరకు కలెక్టరేట్‌లో రిపోర్టు చేశారు. వారం రోజులు దాటుతున్నప్పటికీ వీరిలో ఎవ్వరికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం చర్చకు దారితీస్తోంది. ఖాళీగా ఉన్న మండలాల్లో డిప్యూటీ తహశీల్దార్లను ఇన్‌చార్జీలుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్.. వీరికి మాత్రం ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వలేదు.
అలాగే ఎన్నికల సందర్భంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మంల నుంచి 41 మంది తహశీల్దార్లు జిల్లాకు వచ్చారు. వీరికి ఇటీవల వారు తిరిగి సొంత జిల్లాలకు బదిలీ అయింది. ఇందులో 31 మంది తహశీల్దార్లు రిలీవ్ అయ్యారు. మిగిలిన పది మందిని ఎన్నికల లెక్కలు సమర్పించాల్సి ఉందని కలెక్టర్ రిలీవ్ చేయలేదు. ప్రస్తుతం జిల్లాలో 31 మంది తహశీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ జిల్లాకు వచ్చిన తహశీల్దార్లకు పోస్టింగ్‌లు కేటాయించలేదు.
ఈ ఫైలు ప్రస్తుతం కలెక్టర్ పరిశీలనలో ఉంది.ఒకటీ రెండు రోజుల్లో ఈ ఫైలుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో మంచిర్యాల, ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి మండలాల్లో పనిచేసేందుకు తహశీల్దార్లు ఎంతో ఆసక్తి చూపుతుంటారు.
పాత స్థలాలకు ఎంపీడీఓలు.. : ఈసారి ఎన్నికల సందర్భంగా ఎంపీడీవోలకు కూడా బదిలీలు అయ్యాయి. జిల్లా నుంచి 16 మంది ఎంపీడీవోలు వివిధ జిల్లాలకు బదిలీ అయ్యారు. ఎన్నికల అనంతరం వీరిలో 13 మంది తిరిగి జిల్లాకు వచ్చారు. వీరు గతంలో ఎక్కడైతే పనిచేశారో.. అదే పోస్టుల్లో వీరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ తహశీల్దార్ల పోస్టింగ్‌ల విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టింగ్‌లు ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో తహశీల్దార్లను పోస్టింగ్‌ల విషయంలో కలెక్టర్ల నిర్ణయమే కీలకం అవుతోంది.