కామారెడ్డి: గల్ఫ్‌లోని డ్రగ్స్ మాఫియా చేతిలో అమాయకులైన తెలంగాణ కార్మికులు కీలు బొమ్మలుగా మారుతున్నారు. వివరాలు.. ఉపాధి కోసం పొట్ట చేత బట్టుకుని గల్ఫ్ బాట పట్టిన కార్మికులను అదనపు ఆదాయం ఆశ చూపుతూ గల్ఫ్‌లోని డ్రగ్స్ మాఫియా తమ గుప్పిట్లో పెట్టుకుంటోంది. అలా మాఫియా గుప్పిట్లో బందీలైన కార్మికులు తమ దురదృష్టం కొద్దీ పోలీసులకు చిక్కుతున్నారు. ఇటీవల మోర్తాడ్, బాల్కొండకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇలాగే దుబాయ్ పోలీసులకు చిక్కారు. వారిని అక్కడి జైలుకు పంపినట్లు సమాచారం.
గతంలోనూ కమ్మర్‌పల్లికి చెందిన ఒక యువకుడి వద్ద గల్ఫ్‌లో నిషేధించిన పెన్సిడిల్ మందు మాత్రలు లభించడంతో అతన్ని దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి కోర్టు నిందితునికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, ఇప్పటికే మూడు సంవత్సరాల శిక్షను అనుభవించాడు. అక్కడి ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసిన తక్కువ డోస్ గల మందులనే గల్ఫ్‌లోని వారు వినియోగించాలనే నిబంధన ఉంది. భారత్ నుంచి ఉపాధి కోసం వచ్చే కార్మికులతో గల్ఫ్‌లో నిషేధించిన మందులను పార్శిల్ రూపంలో డ్రగ్స్ మాఫియా రవాణా చేయిస్తుంది. పార్శిల్ తెచ్చిన కార్మికులకు నజరానా ఇస్తుంది. ఎవరైనా పార్శిల్ తీసుకురావడానికి ఒప్పుకోకపోతే, వారి టిక్కెట్ చార్జీలను సైతం మాఫియానే చెల్లించడం గమనార్హం. ఇలా తెచ్చిన మందులను ఆరోగ్యం సరిగాలేని వారికి ఎక్కువ ధరకు విక్రస్తారనే విషయం ప్రచారంలో ఉంది. ఇదిలా ఉండగా డ్రగ్స్ మాఫియా చేతిలో కీలు బొమ్మలుగా మారిన దాదాపు 15 మందిని గల్ప్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు సమాచారం.