చట్టాలను పకడ్బందీగా అమలు చేయూలి
- సమస్యలపై మహిళలు చైతన్యంతో పోరాడాలి
- రాష్ర్ట మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం
- హన్మకొండలో న్యాయవిజ్ఞాన సదస్సు
కేయూ క్యాంపస్ : ఎన్నిచట్టాలు వచ్చినా మహిళలపై దాడులు దౌర్జన్యాలు హింస, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు చేసినం త మాత్రాన సరిపోదని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ఆయాచట్టాలపై అవగాహన పెంచుకుని పోరాడాలని పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ గ్రామీ ణ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ సోషల్ సర్వీస్, ఉమెన్ కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సెమినార్‌హాల్‌లో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ప్రశ్నించి ముందుకెళ్లినప్పుడే సమాజంలో ముందుకెళ్తారాన్నారు.
సామాజిక, రాజకీయ, ఆర్థిక స్వాతంత్య్రం, మహిళా సాధికారిత కో సం కొన్నేళ్లుగా ఎన్నో సదస్సులు, సమావేశాలు నిర్వహించి చైతన్యం చేసే ప్రయత్నాలు చేశామన్నారు. అయినప్పటికీ మహిళలకు సాధికారిత ఇంకా రాలేదన్నారు. ఎన్నారై వివాహాలు వివాదస్పదమవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశాల మధ్య చట్టాల్లో తేడాలుండడంతో ఈ సమస్య తలెత్తుతోందన్నారు. మహిళా కమిషన్ వద్దకు ఇలాంటివి 35 కేసులు వచ్చాయన్నారు.
గల్ఫ్ దేశాలకు వెళుతున్న మహిళలు వారు ఏ ఏజెంటు ద్వారా వెళుతున్నారో ప్రభుత్వానికి వివరాలు అందించాలన్నారు. వరంగల్ జిల్లాలో ఈనెల 14న వేధింపులతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలిచివేసిందన్నారు. ట్రైసిటీలో పోలీసులు మఫ్టీలో ఉండి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని సదస్సులోనే ఉన్న వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావును ఆమె కోరారు.
ఇండియన్ సోషల్ సర్వీస్ జిల్లా అధ్యక్షుడు బాలరాజు, లా కాలేజీ ప్రిన్సిపాల్ విజయచంద్ర, ఉమెన్ డెవలప్‌మెంట్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం ఆర్‌జేడీ వై.శైలజ, సీడబ్ల్యూసీ సభ్యులు చంద్రశేఖర్, చక్రధర్, ఎక్సెటెన్సన్ ఆఫీసర్ ప్రేమలత, రేవతి ఓంకార్, రమేష్, మిత్ర అవేర్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు పి.రామారావు పాల్గొన్నారు. న్యాయవిజ్ఞాన సదస్సు ఈనెల 16న కూడా కొనసాగనుంది.
నమ్మకం సన్నగిల్లుతోంది...
హన్మకొండ సిటీ : మహిళలపై జరిగిన దా డులు, అఘాయిత్యాలపై కేసులు సంవత్సరాల తరబడి నడుస్తుండడంతో మహిళల్లో నమ్మకం సన్నగిల్లుతోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. హన్మకొండలోని సర్క్యూ ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా కేసులను సత్వరం పరిష్కరించాలని మహి ళ కమిషన్ న్యాయమూర్తులను కోరామన్నారు. కేసుల్లో త్వరగా తీర్పు వచ్చేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై లా కమిషన్ సూచనలు చేయాలని కోరారు.
ప్రతి గ్రామం గంగదేవిపల్లి కావాలి
గీసుకొండ : జాతీయ ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన గంగదేవిపల్లి గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం సూచించారు. బుధవారం సాయంత్రం ఆమె గంగదేవిపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గంగదేవిపల్లిలో 24 కమిటీల ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పని చే స్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కితాబిచ్చారు. గ్రామ అభివృద్ధి కమిటీ నాయకుడు కూసం రాజమౌళి గ్రామాభివృద్ధి గురించి ఆమెకు వివరిస్తుంటే... సరళమైన భాషలో సూటిగా విషయాలను చెప్పడం విశేషమని, ఎంత వరకు చదువుకున్నారని ఆయనను ఆమె ప్రశ్నించారు.
తాను 9వ తరగతి వరకు చదువుకున్నానని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయారు. ఆయన వివరించిన తీరును వెంకటరత్నం ప్రశంసించారు. సమావేశంలో సర్పంచ్ ఇట్ల శాంతి, గ్రామ అభివృధ్ధి కమిటీ నాయకుడు, ఉప సర్పంచ్ కూసం రాజమౌళి, తహసిల్దారు మార్గం కుమారస్వామి, మంచినీటి నిర్వహణ కమిటీ అధ్యక్షుడు పెండ్లి మల్లారెడ్డి, కారోబార్ చెంచు రాజయ్య, సీఏ పెండ్లి జనార్ధన్, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా త్రిపురన వెంకటరత్నం పంచాయతీ కార్యాలయంలో గ్రామ అభివృద్ధి కమిటీల ఫొటోలను పరిశీలించారు.