భూముల మార్కెట్ విలువలను సవరించం
హైకోర్టుకు నివేదించిన తెలంగాణ ప్రభుత్వం
- సవరణ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని వాదన
- భూ సేకరణ నోటిఫికేషన్లకు ముందు సవరించారో లేదో చెప్పండి
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. విచారణ వచ్చే వారానికి వారుుదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించరాదని నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ‘‘మార్కెట్ విలువల సవరణ పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. దాని పెంపు తగ్గింపుల నిర్ణయాన్ని రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటాం. నిర్దిష్ట ప్రాంతంలో ప్రస్తుతమున్న భూముల మార్కెట్ విలువ ఆధారంగా సవరణ ఉంటుంది. మార్కెట్ విలువను 2008, 2010ల్లో సవరించాం. 2013లో ఆఖరి సవరణ జరిగింది. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలుగుతున్న సమయంలో మార్కెట్ విలువను సవరించాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వం తప్పనిసరిగా మార్కెట్ విలువను సవరించాలని చట్టంలో ఎక్కడా లేదు. ఇండియన్ స్టాంపు చట్టం 1899ను అమలు చేయడానికే 1998లో మార్కెట్ విలువ సవరణల నిబంధనలను రూపొందిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది’’అని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు విన్పించారు. వీటిని పరిశీలించిన హైకోర్టు, 2013 కొత్త భూ సేకరణ చట్టం కింద భూ సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్లను ప్రకటించే ముందు ఆయా జిల్లాల కలెక్టర్లు మార్కెట్ విలువను సవరించారో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంబంధిత వివరాలన్నింటినీ తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వారుుదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించకపోవడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, రైతు నాయకుడు కోదండరెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. గత విచారణ సమయంలో ధర్మాసనం ఆదేశించిన మేరకు మేరకు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర సోమవారం కౌంటర్ దాఖలు చేశారు. మార్కెట్ విలువ సవరణాధికారం జిల్లా కలెక్టర్‌దేనని ఏజీ రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సేకరణకు నిర్ణరుుంచిన భూమికి సంబంధించి కలెక్టర్ సవరించిన మార్కెట్ విలువ సంతృప్తికరంగా లేదని ఎవరైనా భావిస్తే 2013 భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 30 ప్రకారం మార్కెట్ విలువ సవరణకు నిర్దేశించిన విధానానికి అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి భూ సేకరణ చర్యలు ప్రారంభించడానికి ముందే జిల్లా కలెక్టర్ మార్కెట్ విలువను సవరించాల్సిన అవసరం లేదు’’అని వివరించారు. రెండేళ్లకొకసారి మార్కెట్ విలువను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భారీగా భూములను సేకరిస్తోందని, మార్కెట్ విలువలను మాత్రం సవరించడం లేదని వివరించారు.