నలభై రెండేళ్ల పోరాటం... దళిత రైతుల విజయం
► పూర్వీకుల భూమి కోసం ఫలించిన న్యాయ పోరాటం
► అసైన్‌మెంట్ రద్దు చెల్లదంటూ హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: తాతల నాటి భూమి... వారస త్వంగా వస్తుందనుకున్నది అసైన్‌మెంట్ రద్దు చేయడంతో వారికి కాకుండా పోయింది. తహసీల్దార్ మొదలు... హైకోర్టు వరకు... ముగ్గురు దళిత రైతులు నాలుగు దశాబ్దాలకు పైగా ధర్మ యుద్ధమే చేశారు. 1975 నుంచి కొనసాగుతున్న వీరి న్యాయ పోరాటం లో నలభై రెండేళ్ల తరువాత ఎట్టకేలకు విజయం సాధించారు. ఈ రైతుల పూర్వీకులకిచ్చిన అసైన్ మెంట్‌ను రద్దు చేస్తూ ఇన్‌చార్జి కలెక్టర్ హోదాలో అప్పటి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఆ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని తేల్చిచెప్పడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆ అధికారం డీఆర్‌వోకు లేదు...
అసైన్‌మెంట్ రద్దు చేసే అధికారం డీఆర్‌వోకు లేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అంతేకాక భూమి స్వాధీనం విషయంలో అధికారులు సింగిల్ జడ్జిని సైతం తప్పుదోవ పట్టించారంది. రైతులకు వ్యతిరే కంగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్ర మణియన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఆదిలా బాద్ జిల్లా, దస్నాపూర్ గ్రామంలో లంకా మోహన్, లంకా రాజారాం, లంకా ఆశన్నల పూర్వీకులకు రెవెన్యూ అధికారులు ఐదెకరాల వ్యవసాయ భూమిని 1961లో అసైన్‌మెంట్ కింద ఇచ్చారు.
1972లో అసైన్‌మెంట్ రద్దు నిమిత్తం అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 1975లో అప్పటి డీఆర్‌వో ఇన్‌చార్జి కలెక్టర్ హోదాలో అసైన్‌మెంట్‌ను రద్దు చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ బాధితులు కలెక్టర్ ముందు అప్పీల్ చేశారు. అప్పీల్ పెండింగ్‌లో ఉండగానే, కొందరు అధికారులు వారిని ఆ భూముల నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా లంకా మోహన్ తదితరులు 1987లో హైకోర్టును ఆశ్రయించారు. కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సైతం కింది స్థాయి అధికారుల ఉత్తర్వులను సమర్థిస్తూ 2000లో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ లంకా మోహన్, రాజాం, ఆశన్నలు హైకోర్టును ఆశ్రయించారు.
తప్పుదోవ పట్టించారు...
విచారణ జరిపిన సింగిల్ జడ్జి, అధికారులు చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుని పిటిష న్‌ను కొట్టేశారు. దీనిపై వారు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించిం ది. అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ఏరియా) ల్యాండ్ రెవెన్యూ చట్టానికి విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. గడువు ముగిసిన తరువాత అసైన్‌మెంట్‌ను రద్దు చేశారం ది. 1979కి ముందే పిటిషనర్ల భూములను స్వాధీ నం చేసుకున్నామని అధికారులు సింగిల్ జడ్జిని నమ్మించారని, దాని ఆధారంగా ఆయన తీర్పుని చ్చారని తెలిపింది. కానీ రికార్డులను పరిశీలిస్తే అందుకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించామంది.