సాక్షి నెట్‌వర్క్: అప్పుల బాధతో ముగ్గురు రైతులు మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌కు చెందిన పోసాని భూపాల్(32) తనకున్న ఎకరంలో వరి సాగు చేశాడు. నీరు లేక పంట పూర్తిగా ఎండుముఖం పట్టింది. భూపాల్ ఎనిమిదేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లి పనిలేక ఉత్తి చేతులతో తిరిగి వచ్చాడు. సాగు కోసం, విదేశాలకు వెళ్లేందుకు చేసిన అప్పులు పెరిగిపోయాయి. దీంతో మనోవేదనతో బుధవారం గుండెపోటు వచ్చింది. కామారెడ్డిలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అంతలోనే మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం మల్లంపల్లికి చెందిన రైతు బాపు లింగయ్య(43) తనకున్న 20 గుంటలతో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని పత్తి వేశాడు. వర్షాలు లేక పంట నష్ట పోయాడు. దీంతో రూ. లక్ష వరకు అప్పు అయ్యింది.
రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో బుధవారం ఇంట్లో అప్పు విషయం మాట్లాడుతూ ఆకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి చెందిన రైతు పుల్లయ్య(55) తనకున్న మూడు ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంట చేతికి రాలేదు. పంటపై చేసిన అప్పులతోపాటు, కూతురి పెళ్లికోసం చేసిన అప్పులు కలిపి మూడు లక్షల వరకున్నాయి. వాటిని తీర్చలేక మంగళవారం ఉదయం పశువులను మేపడానికి అడవికి వెళ్లి చింతకుర్వ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు.
అప్పులబాధతో ముగ్గురు మృతి
Published Thu, Nov 27 2014 1:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement