సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పీపుల్స్‌వార్, ఎంసీసీఐ పార్టీలు విలీనమై మావోయిస్టు పార్టీగా ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను పెద్ద ఎత్తున జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దోపిడీ పాలనకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాలు ఏకం కావాలని, దళిత, ఆదివాసీ, మైనార్టీ, మహిళలు ఈ క్రమంలో పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఆ పార్టీ కోరింది.
ప్రజా ప్రభుత్వాల స్ఫూర్తితో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పూర్తి చేసే దిశలో మిలిటెంట్ పోరాటాలకు సిద్ధపడాలని, దోపిడీ పాలనను నలుమూలలా నిర్మూలించేంతవరకు విరామం లేకుండా గెరిల్లా పోరాటాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శి కిరణ్ పేరిట సోమవారం ‘సాక్షి’ కార్యాలయానికి బహిరంగ లేఖ వ చ్చింది.
కిరణ్ లేఖ పూర్తి పాఠం ఇది.....
‘సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్, ఎంసీసీఐ పార్టీలు కలిసి ఒకే పార్టీగా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఈ తరుణంలో ఉజ్వలమైన మార్క్సిజం - లెనినిజం -మావో ఆలోచనా విధానం పతాకాన్ని ఎత్తి పట్టడాన్ని మనం కొనసాగించాం. దేశ నిర్దుష్ట పరిస్థితుల్లో సాగిన మన విప్లవ చిరునామాకు దానిని అన్వయించాం.
దీర్ఘకాలిక యుద్ధాన్ని కొనసాగించడంలో, అభివృద్ధి పర్చడంలో పలు విజయాలు సాధించాం. భూస్వామ్య రైతాంగ ప్రజా బాహుళ్యాన్ని వ్యతిరేకించి పేద, భూమిలేని రైతులను సమీకరించి వారిపై ఆధారపడి గ్రామాల్లో, ప్రాంతాల్లో వ్యవసాయ విప్లవ గెరిల్లా పోరాటాన్ని అభివృద్ధి చేయడం ద్వారా విముక్తి ప్రాంతాల స్థాపన వైపు పురోగమిస్తున్నాం. ప్రతీఘాతక పాలక వర్గాలు చేపట్టిన నిరంతరాయమైన నిర్బంధాన్ని, అణచివేత, క్యాంపెయిన్‌లను ప్రతిఘటించి పోరాటాన్ని కొనసాగిస్తున్నాం.
పలు గెరిల్లా జోన్లలో గెరిల్లా సైన్యాన్ని, పీఎల్‌జీఏను అభివృద్ధి చేస్తూ విముక్తి ప్రాంతాల వైపు పురోగమిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కొంత దెబ్బతిన్నప్పటికీ దండకారణ్యం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, మిగతా రాష్ట్రాల్లో విస్తరించాం. విశాల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రభుత్వాలను ఏర్పరుచుకుని పురోగమిస్తూ పట్టణాలు చుట్టుముట్టే వైపు పరుగెడుతూ నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పూర్తి చేసే దిశగా సాగుతున్నాం. ఈ కాలంలో మితవాద, అవకాశవాద ధోరణులకు వ్యతిరేకంగా పోరాడి విజయాలు సాధించాం. నేడు ప్రపంచంలో మునుపెన్నడూ ఎరుగని కల్లోల పరిస్థితి నెలకొని ఉంది.
కోట్లాది ప్రజలు సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ వ్యతిరేక, ప్రత్యేకించి అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలోకి వస్తున్నారు. ఈ క్రమంలో సామ్రాజ్యవాద శక్తులకు ఊడిగం చేసే సకల ప్రతీఘాత శక్తులకు, వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాటంలోకి వస్తున్నాం. అన్ని మావోయిస్టు శక్తులు ఏకతాటిపైకి వచ్చేలా ఒక వేదిక ఏర్పరుచుకుని వివిధ సమస్యలపై ఉమ్మడి పోరాటాలు చేస్తున్నాం.
మార్క్సిజం -లెనినిజం - మావోయిజం అనే సైద్ధాంతిక ఆయుధాన్ని ధరించిన మనం మన భావజాలాన్ని భారతదేశంలోని వర్తమాన ప్రపంచంలోని నిర్దుష్ట పరిస్థితులకు అన్వయించి దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని మరింత లోతుగా విస్తృతం చేసుకోగలమని, పురోగమింపజేయగలమని విశ్వసిస్తున్నాం. ఇలా మార్క్సిజం - లెనినిజం - మావోయిజాన్ని సృజనాత్మకంగా అన్వయించే క్రమంలో నుంచే దానిని విప్లవ అనుభవాలతో విశ్లేషించే క్రమంలో మనం ఈ కార్మిక విజ్ఞాన శాస్త్రాన్ని మరింత సుసంపన్నవంతం చేయగలగాలి.
ప్రియమైన ప్రజలారా... ప్రజాస్వామిక వాదులారా... సీసీఐ మావోయిస్టు పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటూ ఈ మధ్యకాలంలో సాధించిన విజయాలను నెమరవేసుకుంటూ కొత్తగా నూతన ఒరవడిలోనికి మునుముందుకు పోవాలని పిలుపునిస్తున్నాం. మావోయిస్టు పార్టీ, దాని నాయకత్వంలో పీడితులందరూ సమీకృతులై సమష్టిగా నడుస్తూ దోపిడీ పీడనను, అవినీతి, కుంభకోణాలకు పాల్పడే అరాచక శక్తులను, ప్రభుత్వాలను కూల్చివేయాలని కోరుతున్నాం.
శ్రామిక వర్గ సీపీఐ మావోయిస్టు నాయకత్వాన అందరూ కలిసి రావాలని, భూమి, భుక్తి, విముక్తి కావాలంటే ఈ దోపిడీ సమాజాన్ని నలుమూలలా నిర్మూలించకుండా మనం మనగలగడం అసాధ్యమని భావిస్తున్నాం. అందుకోసం సమస్త ప్రజానీకం కులమతాలకు అతీతంగా పీడితులందరూ ముక్తకంఠంతో ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. ’
దశాబ్ది ఉత్సవాలు నిర్వహించండి
Published Wed, Sep 17 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM
Advertisement
Advertisement