'అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ'
హైదరాబాద్: అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. ఆయన శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..ఢిల్లీ నుంచి గల్లీ దాకా కుంభకోణాల చరిత్ర కాంగ్రెస్ నేతలదన్నారు. కాంగ్రెస్ నేతలు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అవినీతి ఆరోపణలతో కోర్టుల చుట్టూ తిరిగింది కాంగ్రెస్ మంత్రులు కాదా అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధు యాష్కీ జీహెచ్‌ఎంసీలో కుంభకోణానికి నైతిక బాధ్యత వహించి మంత్రి కేటీఆర్‌ను రాజీనామా చేయాలనడం అవివేకమన్నారు. జీహెచ్‌ఎంసీలో ఎలాంటి కుంభకోణం జరగలేదని..జరగని 200 పనుల్ని జరిగినట్లు వెబ్‌సైట్‌లో తప్పుగా చూపారని చెప్పారు.
మధు యాష్కీకి దమ్ము ధైర్యం చీము, నెత్తురు ఉంటే జీహెచ్‌ఎంసీ జరిగిందంటున్న కుంభకోణంపై ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. అనవసర ఆరోపణలు చేసి జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల మనోబలాన్ని దెబ్బతీయ్యెద్దని హెచ్చరించారు. కేటీఆర్, ఎంపీ కవితలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ చేసిన వ్యాఖ్యలను బాల్క సుమన్ ఖండించారు. కనుచూపు మేరలో కాంగ్రెస్‌కు అధికారం రాదనీ తెలిసి సంపత్ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. గడ్డం తీసుకునే అవసరం పీసీసీ అధ్యక్షుడికి రాదన్నారు.
మరోవైపు తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్పైనా ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. మేధావి ముసుగులో కోదండరామ్ తమపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు మేలు చేసేవిధంగా వ్యవహరిస్తున్నారని, కొత్త జిల్లాలు, ప్రాజెక్టుల నిర్మాణం అంటే కోదండరామ్కు ఇష్టం లేదా అని సూటిగా ప్రశ్నించారు.