హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని మౌలాలీ ప్రాంతంలో ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలానికి దారితీసింది. మధ్యాహ్నం స్కూల్ నుంచి తిరుగుముఖం పట్టిన చిన్నారులు తీవ్ర గాలింపు చర్యల అనంతరం రాత్రి 8.30 గంటల సమయంలో నాచారంలో కనిపించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాలు.. వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం అమ్మాపురానికి చెందిన చిరంజీవి, ఆయన భార్య సుమలత నిర్మాణరంగ కార్మికులుగా పనిచేస్తూ మౌలాలీ హౌసింగ్ బోర్డు పరిధిలోని కైలాసగిరిలో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె కీర్తి(6), కుమారుడు ధనుష్ (4) ఎప్పటిలా బుధవారం కూడా స్థానిక అంగన్‌వాడీ స్కూల్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ స్కూల్లోనే ఉండి ఆ తర్వాత ఇంటికి బయల్దేరారు. కానీ, వారు ఇంటికి చేరుకోలేదు. కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన చిరంజీవి దంపతులకు పిల్లలు ఇద్దరూ కనిపించకపోయే సరికి కలవరం చెందారు. అంగన్‌వాడీ స్కూల్ టీచర్‌ను విచారించగా పిల్లలు ఇంటికి వెళ్లినట్లు చెప్పారు.
స్థానికంగా తెలిసిన వారందరినీ విచారించి, చివరికి కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. రంగంలోకి దిగిన పోలీసులు అదృశ్యమైన చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలకు వరుసకు మేనమామ అయిన శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, అదృశ్యమైన ఇద్దరు చిన్నారులను రాత్రి 8.30 గంటల సమయంలో నాచారంలో గుర్తించారు. అయితే, వారు దారితప్పి వెళ్లారా, లేక ఎవరైనా అపహరించి పోలీసుల గాలింపు చర్యలతో వదిలిపెట్టి వెళ్లిపోయారా అన్న కోణంలో పోలీసుల విచారిస్తున్నారు.
ఇద్దరు చిన్నారుల అదృశ్యం
Published Wed, Feb 4 2015 9:04 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
Advertisement
Advertisement