ప్రమాద ఘంటికలు | Underground Water Level Disreed Warangal | Sakshi
Sakshi News home page

ప్రమాద ఘంటికలు

Published Mon, Jun 3 2019 11:04 AM | Last Updated on Mon, Jun 3 2019 11:04 AM

Underground Water Level Disreed Warangal - Sakshi

హన్మకొండ / భీమదేవరపల్లి : వర్షాభావ పరిస్థితులు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో చెరువులు, కుంట ల్లోకి నీరు చేరక భూగర్భజలాలు వృద్ధి కాలే దు. దీనికి తోడు మానవ అవసరాలకు ఉన్న నీరంతా తోడేస్తున్న ఫలితంగా నెలనెలా భూగర్భజలాలు పడిపోతూ వచ్చాయి. రుతుపవనాలు ముందు మాసం మే నాటికి భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా తాగునీటి అవసరాలు తీర్చుకునే గ్రామాల్లో ప్రజలకు నీరు దొరకక సమస్యలు ఎదుర్కొంటున్నా రు. మిషన్‌ భగీరథ పథకం కొన్ని గ్రామాల్లో ఆదుకుంటుండంగా మరి కొన్ని గ్రామాల ప్రజలు నీటి అవసరాలకు నానా పాట్లు పడుతున్నారు.

సగటున 12.46 మీటర్లు
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో సగటున 12.46 మీటర్ల లోతుకు వెళ్తే తప్ప నీటి జాడలు కానరావ డం లేదు. 2018 మే మాసం నాటికి 10.11 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది మే మాసాంతం వరకు 12.46 మీటర్ల లోతుకు పడిపోయాయి. అంటే మరో 2.84 మీటర్ల లోతుకు పడిపోయాయన్న మాట. జిల్లాలో అత్యధికంగా బీమదేవరపల్లి, ఐనవోలు మండలంలో భూగర్భజలాలు అడుగంటి పోయాయి. ఈ రెండు మండలాల్లో 16 మీటర్ల లోతుకు జలాలు వెళ్లాయి. బీమదేవరపల్లి మండలం వంగరలో 16.15 మీటర్ల లోతులో, గట్లనర్సింగపూర్‌లో 15.22 మీటర్ల లోతులో నీరు ఉంది. వంగరలో గతేడాది మే నాటికి 3.75 మీటర్ల లోతులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 12.79 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయ న్న మాట. ఇక ఐనవోలు మండలం పంథినిలో 16.46 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. గతేడాది మాసాంతం వర కు అక్కడ 13.66 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. జిల్లా కేంద్రమైన హన్మకొండకు వచ్చే సరికి 13.53 మీటర్ల లోతుకు భూగ ర్భ జలాలు పడిపోయాయి. దీంతో నగరంలో ఇంటి అవసరాలకు వేసిన బోర్లు ఎండిపోయాయి. ఫలితంగా ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడంతో ప్రమాదఘంటికలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో వర్షాలు కురవకపోతే పరి స్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

సగం బాయిలు ఎండిపోయినయి...
భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. గ్రామంలో కరువు కరాళనృత్యం చేస్తుంది. బోరుబావుల్లో నీళ్లు పాతాళలోకంలోకి పోగా ఇక వ్యవసాయ బావుల్లో సైతం నీళ్లు అడుగంటాయి. ఫలితంగా పశువులు తాగేందుకు సైతం సరిపోవడం లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. వంగరలో గ్రామంలో మొత్తం 6,024 ఎకరాల భౌగోళిక విస్తీర్ణం కాగా అందులో 4,418 ఎకరాల్లో సాగు భూమి ఉంది. సాగు నీటిని అందించేందుకు 380 వ్యవసాయ బావులు, 295 బోరు బావులు ఉన్నాయి. కాగా ఈ ఏడాదిలో సాగు నీరు ఇబ్బందిదిని దృష్టిలో పెట్టుకుని రైతులు ముందు జాగ్రత్తగా తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగు చేశారు. 149 ఎకరాల్లో వరి, 242 ఎకరాల్లో మొక్కజొన్న, 24 ఎకరాల్లో వేరుశనగతో పాటుగా 75 ఎకరాల్లో కూరగాయలు తదితర పంటలను సాగు చేశారు. పంటచేతికొచ్చే సమయంలో ఎండల తీవ్రత పెరగడంతోకావడం, బావులు, బోరుబావుల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. దీంతో సాగు నీరు అందక సగం మేర వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోయాయి.

ఇక మే మాసంలో గ్రామంలోని 295 బోరుబావులకు గాను సుమారుగా 200పై చిలుకు బోర్లలో నీటి జాడే లేకుండా పోయింది. అలాగే, 380 వ్యవసాయ బావుల్లో 150 వ్యవసాయ బావులు పూర్తిగా ఎండిపోగా, 90కి పైగా బావుల్లో అరగంట పాటు మాత్రమే నీళ్లు అందిస్తున్నాయి. అంతేకాకుండా ఇక 140 బావులు కేవలం 10 నుంచి 20 నిమిషాల మేర మాత్రమే మోటరు ద్వారా నీళ్లు అందిస్తున్నాయి. అయితే, ఈ నీరు పశువులకు తాగు నీటికి మాత్రమే సరిపోతున్నాయి. ఒకప్పుడు యాసంగిలో రైతులు పంటల సాగుతో పాటుగా కూరగాయల సాగు చేసేవారు. కానీ ప్రస్తుతం వ్యవసాయ బావుల్లోని నీరు కేవలం పశువులకు మాత్రమే అందుతుండడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement